సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): : గ్రేటర్ హైదరాబాద్‌లో వందలాది కాలనీలు నిషేధిత జాబితాలోకి చేరడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏ లోకి చేరడంపై మనోవేదనకు గురవుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నగరంలోని పలు కాలనీలు నిషేధిత జాబితాలో ఉన్నాయని ప్రకటించడంతో ప్రజలు కంగుతిన్నారు. మంత్రి నిషేధిత జాబితాను ప్రకటించడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. కాలనీవాసులకు కంటి మీద కునుకు లేకుండా మారింది. నగర వ్యాప్తంగా నిషేధిత జాబితా అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, పలు కాలనీల సొసైటీలు, లేఅవుట్లు, అపార్ట్మెంట్ల సముదాయాల ప్రజలు తమ ఇండ్లు, ఆస్తుల పరిస్థితేంటని ఆరా తీస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకుని ఆశల సౌధాలపై తమకు హక్కులు లేవనే మాట వినడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. తిండి, నిద్రలకు ఓర్చుకుని కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అకారణంగా ప్రభుత్వం పేరిట చేరడంతో కలత చెందుతున్నారు. పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అన్ని అనుమతులిచ్చిన ప్రభుత్వమే నిషేధిత జాబితాలోకి మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఆస్తులు అమ్ముకోలేని, కొనుక్కోలేని దుస్థితికి చేరడంపై ఆవేదన చెందుతున్నారు.
ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచన పాలనకు ఒడిగడుతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీలు నిషేధిత జాబితాలో పెట్టామని మంత్రి ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలం క్రితం ఏర్పడిన కాలనీలను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన పేరిట ప్రజా వంచన పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏకంగా తమ ఆస్తులనే మింగేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు తగిన బుద్ధి చెప్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దల రియల్ దందా సాగించేందుకే సామాన్య ప్రజల ఆస్తులను ప్రభుత్వ జాబితాలోకి మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి భూ దందాలకు పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను పణంగా పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించకుంటే ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వసంతనగర్ కాలనీలో యాభై ఏండ్ల క్రితం ఇండ్ల స్థలాలు కొని ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. కూకట్‌పల్లిలోని సర్వే నంబర్ 145, 163లో సుమారు 360 ఎకరాల్లో 8 కాలనీలను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. ఈ సర్వే నంబర్లలో వేలాది ఇండ్లు ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నాం. కలెక్టర్‌కు, సీసీఎల్ఏకు, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. స్థానిక అధికారులను అడిగితే.. సుప్రీంకోర్టు ఆదేశాలు అంటున్నారే తప్ప మేము చేసిన తప్పు చెప్పడం లేదు. మేము ఎవరిని కలిసిన సమాధానం చెప్పడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోతున్నాం..ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
– శ్యామలరాజు, వసంతనగర్ కాలనీ
ఇండ్ల నిర్మాణం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా జీహెచ్ఎంసీ అధికారులు ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు. కరెంట్ మీటర్లు, డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారు. ఏండ్ల తరబడి ఆస్తి పన్ను కూడా కడుతున్నాం. ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొందినప్పటికి నిర్మాణాలు పూర్తై 30 ఏండ్ల నుంచి నివాసముంటున్నాం. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ గురుకుల ట్రస్ట్ భూములకు సంబంధించినది కావడంతో ఇది వరకు పెండింగ్ రిజిస్ట్రేషన్లు అయ్యేవి .22 ఏ జాబితా పుణ్యమా ఆ అవకాశమే కూడా లేకుండా పోయింది. సామాన్య ప్రజలను బలిచేయడం న్యాయం కాదు.
– భిక్షపతి ముదిరాజ్, అయ్యప్ప సొసైటీ
పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెములలో ఉన్న హెచ్ఎండీఏ వెంచర్లో 150 గజాల స్థలాన్ని రూ.42వేల చొప్పున రూ.63లక్షలు పెట్టి కొనుగోలు చేశాను. ఆ స్థలం భవనాన్ని నిర్మించి, విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని, పెట్టుబడి పెట్టాను. ఆ వ్యక్తిపై రుణం కూడా మంజూరైంది. హెచ్ఎండీఏ వెంచర్‌ను నిషేధిత జాబితాను చేర్చడంతో రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదు. అధికారులు చుట్టూ తిరుగుతున్నాం. ఇలా జరగడం తీవ్ర మానసికం క్షోభకు గురి చేస్తుంది.
-వినోద్ చారి, కొర్రెముల, పోచారం
జీడిమెట్లలోని హెచ్ఏఎల్ రాఘవేంద్రకాలనీ (సర్వేనంబర్ 192,193) 1985లో ఏర్పడిన పాత కాలనీ. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో గృహనివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్లు అమ్ముకొని పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, ఇతర ఖర్చుల కోసం వెచ్చించుకోవాలంటే సాధ్యం కావడం లేదు. మంత్రి పొంగులేటి కార్యాలయంలోని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యా దు చేసినా పురోగతి లేదు.
– తోకల నగేశ్‌రెడ్డి, హెచ్ఏఎల్ రాఘవేంద్రకాలనీ
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భేష్‌గా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితాలో న్యూవిద్యానగర్ను చేర్చడానికి ప్రామానికం ఏంటి. 22ఏ జీఓను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
-తుపాకుల జనార్దన్, న్యూ విద్యానగర్
కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పట్టిండుకోవడం లేదు. ఇక్కడ పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. 22ఏ జీఓ వల్ల ఇండ్లను అమ్ముకోలేక, కొనలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు సబ్ రిజిస్ట్రార్,కలెక్టర్ కార్యాలయాలనికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. 22ఏ జాబితా నుంచి కాలనీని తొలిగించాలి.
– కృపాకాంప్లెక్స్ కాలనీ నాయకుడు, గౌలికర్ రవీందర్
కాంగ్రెస్‌కు ఓటేసి పెద్ద తప్పు చేశాం అనిపిస్తుంది. పీర్జాదిగూడలోని మల్లికార్జున్‌నగర్‌లో సర్వేనంబర్ 44లో 200 గజాల స్థలం కొన్నాను. 22ఏ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఎన్నో రోజులుగా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఇల్లు కట్టుకోవడానికి రూ.1.40 కోట్లు లోన్ తీసుకున్న. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడింది. రిజిస్ట్రేషన్ అయితే లోన్ రిలీజ్ అవుతుంది. ప్రతినెల రూ.80 వేలు ఈఎంఐ కడుతున్నాను. ప్రభుత్వం నిషేధిత జాబితాలో సర్వేనంబర్ 39, 43, 44 లలోని 50 ఎకరాలు ఉంది. ఈ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి మా భూమిని 22ఏలో నుంచి తొలగించాలి.
-పసన్ గోపి, మల్లికార్జున్‌నగర్, పీర్జాదిగూడ
చందానగర్ శంకర్‌నగర్‌లో ఎక్కడో ఓ మూలాన కొద్దిగా ప్రభుత్వ భూమి ఉందని, సాకుతో పూర్తి కాలనీని 22ఏలో పెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వ అనుమతులతో దశాబ్దాల క్రితం ఇండ్లు కట్టుకున్నం. ఇప్పుడు ప్రభుత్వ భూములుగా మారుస్తామంటే అయిపోతదా, ఇక్కడ ఉన్న ప్రజలకు సమాధానం ఎవరు చెబుతారు. అవసరాల కోసం ఇల్లు అమ్మే వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీపుకొని 22ఏను రద్దు చేయాలి.
– దయాకర్, శంకర్‌నగర్
దశాబ్దాల క్రితం కష్టార్జితంతో ప్లాట్లు కొని క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు, విద్యుత్, నల్లా బిల్లులు చెల్లిస్తున్న ఎంతోమంది కుటుంబాలను ప్రభుత్వం రోడ్డున పడేసింది. వీరంతా చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని, అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాలు పూర్తియిన ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయం. నేడు అత్యవసర సమయాల్లో ఆస్తులు అమ్మాలన్నా కొనేనాథుడే కరువయ్యాడు.
– గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, హెచ్ఏఎల్ రాఘవేంద్రకాలనీ
మల్లాపూర్ డివిజన్ నెహ్రునగర్‌లోని సర్వే నెంబర్ 45లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1992లో పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మ పేరు నుంచి నా పేరుపై రిజిస్ట్రేషన్ కావడం లేదు. తక్షణమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితా నుంచి మా సర్వే నంబర్‌ను తొలగించి మా పేరుపైకి మార్చుకునేందకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాం.
– గద్ద లోకేష్ బాధితుడు
మల్లాపూర్ డివిజన్ నెహ్రునగర్‌లోని సర్వే నెంబర్ 45లో మేము ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. మేము ముగ్గురం అన్నదమ్ములం.ఇల్లు మా అమ్మ పేరుపై నుంచి మాపై మార్చుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయా నికి వెళితే మీ ఇల్లు 22ఏ జాబితాలో ఉన్నదని మీ పేరుపైకి మార్చుకు నేందుకు వీలు లేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను వదిలి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. వెంటనే 22ఏ జాబితా నుంచి పేద ప్రజలకు విముక్తి కల్పించాలి.
-నర్సింగరావు బాధితుడు
ఒక్క సర్వేనంబర్ పరిధిలో యూఎల్సీ పరిమితులు ఉంటే అదే సర్వే నంబర్లోని వందలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం దారుణం. హుడా అనుమతులు ఇచ్చే ముందే ఈ విషయాలను పరిశీలించాల్సి ఉండగా, ఇప్పుడు సామాన్యులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. ప్రభుత్వం, మంత్రులు ఇచ్చిన హామీల ప్రకారం నిషేధిత జాబితా నుంచి ఈ భూములను వెంటనే తొలగించాలి.
– అచ్చుత్వర్ధన్, గాయత్రీనగర్
ప్రభుత్వం ఎలాంటి క్షేత్రస్థాయి పరిశోధన చేయకుండా 22ఏ సెక్షన్‌ను అమల్లోకి తీసుకురావడం కేవలం భూదందాలకు, కమీషన్ల వసూళ్లకు మాత్ర మే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కారం కావు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా అమలు చేయకుండా ఏదైనా ఒక నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని ఉంటే బాగుండేది. -ఎం.శివకుమార్, సుచిత్ర
25 ఏండ్ల క్రితం ప్లాటు కొనుగోలు చేసి, ఇల్లు నిర్మించుకొంటే మా ఇల్లుతో పాటు మా కాలనీ అంతా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనకు గురువుతున్నాను. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే 1956 నుంచి ప్లాట్లకు సంబంధించిన పహాణీలు, ఇంకా ఏవో పత్రాలు తెమ్మంటున్నారు. వాటిని మేము ఎక్కడికెళ్లి తీసుకురావాలి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తగలకమానదు.
-ముత్తయ్య పటేల్, ప్రగతినగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు
పీర్జాదిగూడలోని సర్వేనంబర్ 43లో తాము అపా ర్ట్మెంట్లోని 3వ ఫ్లోర్లో1000 ఎస్ఎఫ్టీ గల ప్లాట్‌ను కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేశాం. సదరు అపార్ట్మెంట్లో కొంత మందివి రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. తమ ప్లాట్ మాత్రం రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేధ,మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టు తిరుగుతున్నాం. అధికారులు ఏమీ చెప్పడం లేదు. మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
-సామ చంద్రశేఖర్, మల్లికార్జున్‌నగర్, పీర్జాదిగూడ
నేను పుట్టిపెరిగిన తూంకుంటలోనే ఇల్లు కట్టుకుందామని ఎన్నో కలలు కన్నా. ఐటీ ఉద్యోగం చేస్తే దాచుకున్న డబ్బుతో తూంకుంట ద్వారకపురి సాయినగర్ కాలనీలో 100 గజాల స్థలానికి దాదాపు రూ.18 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధం చేసుకోగా ఆ భూమి ఉన్న సర్వే నంబర్ 22-ఏలో ఉందని తెలిసింది. సమస్య పరిష్కారం కోసం సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో,సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏం లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుంది.
-దినేష్‌యాదవ్, తూంకుంట
ఐడీపీల్ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగులంతా కలిసి 1985లో స్థలాలను కొనుకున్నాం. ప్రభుత్వ అనుమతితో లేఅవుట్ వేసి, ఇండ్లను నిర్మించుకున్నాం. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇంటి నిర్మాణానికి అనుమతులు వచ్చా యి. గత యేడాదిగా నిషేధిత భూములు అని రిజిస్ట్రేషన్లు, ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదు. మే ము కొన్నరోజే ప్రభుత్వ భూమి అని చేబితే, రిజి్రస్ట్రేషన్ చేయకుంటే బాగుండేది కదా. 40ఎండ్ల తర్వాత ఇప్పడు ప్రభుత్వం నిషేధిత భూముల అని చెబితే ఎంచేయాలి. అధికారులు చూట్టు తీరిగిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మా కాలనీలను నిషేధిత జాబితానుంచి తొలంగించాలి.
– సురగణ రాణాప్రతాప్ , వసంతనగర్ కాలనీ
చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం (పార్ట్), మారుతీనగర్ ప్రాంతాలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న కాలనీవాసులు 22ఏ పిడుగుపాటుకు తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకొని నిషేధిత జాబితానుంచి ఆయా కాలనీలను తొలగించాలి.
-నేమూరి మహేష్‌గౌడ్, చక్రీపురంకాలనీ సంక్షేమసంఘం ప్రతినిధి