మేఘం తన డ్యూటీని మరిచిపోయింది
ఉరుము తన ఉనికిని విడిచిపెట్టింది
చినుకుల చిత్తడి లేక నేలంతా నెర్రలు బారి
ఊరు చెరువంతా అడుగు తేలింది
రైతన్న చినుకు కోసం కునుకు లేక
కాళ్లు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు
మట్టిని మాతృమూర్తిగా ప్రేమించే రైతు
ఎండను మింగి రక్తాన్ని చెమటగా మార్చి
నరాలను పిండి నారుమళ్ల్లుగా మార్చితే
ఎల్ నినో దెబ్బకు ఎండిపోతుంటే
దిగులు పక్షిలా దిగాలుగా చూస్తున్నాడు
రైతన్న గుండె బరువై బతుకు చెరువై
ఇప్పుడు ఎవరిని తడిమి చూసినా
బాధల గుట్టలే కన్నీటి చుక్కలే
మట్టిని నమ్ముకున్న మనిషి ఇప్పుడు
జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా
బోరున విలపిస్తున్నాడు
కరువు రాక్షసి వలలో చిక్కి
రైతన్న ఇప్పుడు గబ్బిలంలా వేలాడుతున్నాడు
ఆలి పుస్తెలను కుదువబెట్టి
రైతన్న ఇప్పుడు అప్పుల కుంపటిని కాగుతున్నాడు
కాలానికి తనువును తాకట్టు పెట్టి
రైతన్న ఇప్పుడు దేహాలకు
గాయాల ముళ్లను గుచ్చుకుంటున్నాడు
ఏలికలకు రైతన్న ప్రచారం మూటై
ఓట్లకు వర్షంలా మిగులుతున్నాడు
దళారుల కుట్రలకు కేరాఫై
పరాన్నజీవిగా మారిపోతున్నాడు
మట్టి మీద తన మనుగడ ప్రశ్నార్థకమై
మరో ఉషోదయం కోసం ఎదురుచూస్తున్నాడు