మట్టిలోంచి పుట్టిన మహాగణపతిని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తీర్చిదిద్దుతున్నాం. ప్రకృతి-పురుషుల గారాలపట్టిని.. పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా రూపుదిద్దుతున్నాం. కాలుష్యకారక విధానానికి స్వస్తి పలుకుతూ ఎందరో మట్టి వినాయకుడే మహా వినాయకుడు అని ఎలుగెత్తి చాటుతున్నారు. తమ శక్తి కొద్దీ మృణ్మయ గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీరిలో ఉపాధి పొందుతున్నవారు కొందరైతే, ప్రజల్లో అవగాహన కోసం ఉచితంగా మట్టి విగ్రహాలు పంచుతున్నవారు మరికొందరు.
భూదాన్ పోచంపల్లికి చెందిన గుండాల దివ్యతేజ మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో దిట్ట. ఆమె తండ్రి 30 ఏండ్లుగా మట్టి పాత్రలు, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులు చేస్తూ ఉన్నారు. ఇంజినీరింగ్ చదివిన దివ్యతేజ ఓ ఉద్యోగంలో చేరింది. ఆరు నెలలకే చేస్తున్న పని మీద విరక్తి పుట్టి ఇంటికి వచ్చేసింది. తండ్రి బాటలోనే మట్టితో జట్టు కట్టాలని నిశ్చయానికి వచ్చింది. మట్టి పాత్రలు చేయడంలో తండ్రి నుంచి శిక్షణ పొందింది. మూడేండ్లుగా మట్టి పాత్రలు చేస్తూనే, వినాయకుడి మట్టి విగ్రహాలు రూపొందిస్తున్నది. తాము చేస్తున్న మట్టి పాత్రలకు ఉన్న డిమాండ్ గణపతి విగ్రహాలకు ఉండటం లేదని గమనించింది దివ్యతేజ. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాల్లో రకరకాల డిజైన్లు ఉంటాయి. మట్టి విగ్రహాల్లో అన్ని డిజైన్లు ఉండవు. ఈ కారణంగానే ఆదరణ లేదని గుర్తించింది. ఇంకేముంది కళాత్మక విగ్రహాలు తయారు చేయడం పనిగా పెట్టుకుంది.
మూడు నుంచి ఎనిమిదిన్నర ఫీట్ల వరకు 64 డిజైన్లు, 8 అంగుళాల నుంచి మూడు అడుగుల వరకు మరో 90 డిజైన్ల వరకు గణపతి ఆకృతులను తయారు చేసింది. దాంతో ఆదరణ పెరిగింది. ఈ విగ్రహాల తయారీకి మట్టిని గంగానది పరివాహక ప్రాంతం నుంచి సేకరిస్తుండటం విశేషం. ‘ఎంతో కష్టపడి ఇంత చక్కగా మట్టితో తయారు చేసి ఇచ్చిన వినాయకులను మురికి నీటిలో నిమజ్జనం చేయడం చాలా బాధ అనిపించింది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు వినాయకుడి విగ్రహంతోపాటు ఓ మొక్కనూ అందజేస్తున్నాను. నిమజ్జనం తర్వాత విగ్రహం మట్టితో ఈ మొక్క నాటాలని సూచించాను. అలా మొదటి ఏడాది ఉసిరి చెట్టు, రెండో ఏడాది బిల్వ పత్రి, ఈ ఏడాది జామచెట్టు ఇస్తున్నాం. తొలిసారి ఇచ్చిన చెట్టు ఉసిరి కాయలు కాసిందని కస్టమర్లు చెబుతుంటే చాలా ఆనందమనిపిస్తోంది’ అని చెబుతున్నది దివ్యతేజ. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ విగ్రహాలు కొనుగోలు చేయడానికి వస్తున్నారు. వ్యాపారమే లక్ష్యంగా కాకుండా పర్యావరణహితం కోరుతూ మూడేండ్లుగా దివ్యతేజ చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయం.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది జిలకపల్లి చందన. బీటెక్ చదివిన ఆమె పెండ్లి తర్వాత గృహిణిగా స్థిరపడింది. కాలక్షేపం కోసం టెర్రకోట ఆర్ట్ నేర్చుకుంది. మట్టితో జువెలరీ తయారు చేయడంలో పట్టు సాధించింది. ఈ క్రమంలో మూడేండ్ల కిందట కుమ్మరి మహిళా సంఘం ఆధ్వర్యంలో మట్టి రాఖీలు, మట్టి వినాయకులను తయారు చేయడంలో శిక్షణ తీసుకుంది. తొలి ఏడాది మట్టి వినాయక విగ్రహాలు చేసి చుట్టుపక్కల వారికి ఉచితంగా పంపిణీ చేసింది. ఆమె పనితనం గురించి తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఏటా మట్టి విగ్రహాల తయారీకి ఆర్డర్లు ఇస్తున్నారు. రెండేండ్లుగా ఏటా 200 మట్టి వినాయక విగ్రహాలు చేసి జీహెచ్ఎంసీకి అందజేస్తున్నది చందన. అంతేకాదు, మట్టి రాఖీలు, వినాయక విగ్రహాల తయారీలో 90 మంది మహిళలకు విడతల వారీగా శిక్షణ కూడా ఇచ్చింది. ‘నావంతుగా పర్యావరణ పరిరక్షణకు సాయం అందిస్తున్నానన్న తృప్తి ఉంది. భవిష్యత్తులో మట్టి ప్రాధాన్యాన్ని తెలిపే ప్రతిమలు తయారు చేయాలన్నదే నా కోరిక’ అంటున్నది చందన.
మన ఆనందం ప్రకృతికి హాని కలిగించకూడదనే ఆలోచనతో పదహారేండ్లుగా పాటుపడుతున్నారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముప్పారపు నరేందర్ కుమార్. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా.. తనవంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచన ఆయనది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి జరుగుతున్న హానిని అడ్డుకోవాలని ‘మట్టి’ సంకల్పం తీసుకున్నారు. పదహారేండ్ల క్రితం మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ విగ్రహాలు అందిస్తూ.. పర్యావరణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విద్యార్థులతో మట్టి విగ్రహాలు తయారు చేయించి.. ఆ విగ్రహాలను వారి ఇండ్లలో పూజించేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రీన్‌క్లబ్ సభ్యుడిగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న నరేందర్ కుమార్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేయడం విశేషం.
-శ్రీనివాస గుప్తా