Maremma | మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన తొలి చిత్రం ‘మారెమ్మ’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. పల్లెటూరి నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే డిజిటల్ వేదికపై మాత్రం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఒకే రోజున రెండు ప్రముఖ ఓటీటీ వేదికల్లో ‘మారెమ్మ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా చూసే అవకాశం లభించింది.
మంచాల నాగరాజు దర్శకత్వంలో ‘మారెమ్మ’ తెరకెక్కింది. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ చిత్రంతో మాధవ్ భూపతిరాజు హీరోగా అరంగేట్రం చేశారు. మాస్ నేపథ్యంతో కూడిన పాత్రను తొలి సినిమాకే ఎంచుకున్న మాధవ్.. నటనతో పాటు నృత్యంతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రవితేజ కుటుంబం నుంచి వచ్చిన హీరో కావడంతో మాధవ్ భూపతిరాజు అరంగేట్రంపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అయితే థియేటర్లలో సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీ విడుదలపై దృష్టి పడింది.
చిత్ర కథ ఏంటంటే.. తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. ఆ గ్రామ ప్రజలు తమ ఇలవేల్పు మారెమ్మ దేవతను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. గ్రామ సంప్రదాయంలో భాగంగా అమ్మవారికి ఓ పవిత్రమైన దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కర్ణి అనే యువకుడు ‘మారి’ అనే దున్నపోతును ఎంతో ప్రేమగా పెంచుతుంటాడు. అయితే అమ్మవారికి బలి ఇచ్చే సమయం దగ్గరపడిన సమయంలో ఆ దున్నపోతు అనూహ్యంగా కనిపించకుండా పోతుంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది. అసలు ‘మారి’ ఎక్కడికి వెళ్లింది? దాన్ని వెతికే క్రమంలో కర్ణికి ఎదురైన సమస్యలేంటి? గ్రామ పెద్దలు, ప్రజలు ఎలా స్పందించారు? చివరకు ఆ దున్నపోతు గ్రామానికి ఎలా కీలకంగా మారింది? అనే అంశాల చుట్టూ కథ కొనసాగుతుంది.