చౌటుప్పల్, అక్టోబర్ 06 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైవే విస్తరణ పనుల నేపథ్యంలో వలిగొండ క్రాస్‌రోడ్డును మూసివేయడంతో స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా పని కోసం రోడ్డు దాటేందుకు కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక లక్కారం అండర్ పాస్ బ్రిడ్జి లేదా లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన క్రాసింగ్ వరకు వెళ్లి వాహనదారులు యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ స్వల్ప దూరం కోసం సెలవు దినాల్లో సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని చెబుతున్నారు. హైవే విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ స్థానికుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం మధ్యలో తాత్కాలిక క్రాసింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
హైవే విస్తరణ పనులు చేపట్టిన పాలకులు, అధికారులు స్థానికుల రాకపోకల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా క్రాసింగ్‌ను మూసివేయడంతో ప్రజలను కిలోమీటర్ల కొద్దీ తిప్పుతున్నారని మండిపడుతున్నారు. తద్వారా అధిక సమయం, వాహనాల ఇంధనం ఖర్చు పెరుగుతుందని వాపోతున్నారు. పనుల నిమిత్తం ప్రతినిత్యం రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుందని, దీంతో రోజులో అధిక సమయం క్రాసింగ్ చేసేందుకు సరిపోతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.