హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ లేని భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం తప్పు కాదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటమే 22ఏ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. 22ఏ నిషేధిత భూముల జాబితాపై సోమవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిషారం చూపేలా కాకుండా, అధికారుల తప్పిదాలను ఏకపక్షంగా సమర్థించుకునేలా ఆ సమావేశం సాగింది. ప్రభుత్వ భూములను కాపాడటమే తమ లక్ష్యమని చెప్తూనే, క్షేత్రస్థాయిలో సామాన్యులు పడుతున్న గోసను సాంకేతిక కారణాల సాకుతో పకనపెట్టే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపించింది. అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన భారీ తప్పిదాలను సైతం ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకొంటున్నదని మంత్రి మాటలు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కేవలం రెండు ఎకరాల భూదాన్ భూమి వివాదం ఉంటే, ఏకంగా 22 ఎకరాల విస్తీర్ణాన్ని 22ఏ జాబితాలో ఉంచామని మంత్రి అంగీకరించారు. ఒక చిన్న సర్వే నంబర్ సమస్యను సాకుగా చూపి, మిగతా 20 ఎకరాల రైతులను ఏండ్ల తరబడి క్షోభకు గురిచేయడాన్ని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సర్వే నంబర్ 403కు సంబంధించి కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాలి. కానీ, హైకోర్టు ఆదేశాల అమలు పేరుతో ఏకంగా 1,280 ఎకరాల మొత్తం సర్వే నంబర్‌నే పీవోబీలో చేర్చడాన్ని ఒక సాధారణ పొరపాటుగా మాత్రమే మంత్రి పొంగులేటి చిత్రీకరించారు. సమస్యలను శాశ్వతంగా పరిషరించే ఉద్దేశం కంటే, నిషేధాన్ని కొనసాగించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు మంత్రి మాటలు స్పష్టం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో 173వ ప్రైవేట్ సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకొని, 172వ ప్రభుత్వ సర్వే నంబర్లో నిర్మాణాలు చేపట్టారని, అందుకే ఆ భూమిని 22ఏలో పెట్టామని మంత్రి చెప్పుకొచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన గ్రామానికి, అనుబంధ హ్యామ్లెట్‌కు ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడం వల్లే గందరగోళం ఏర్పడిందని అంగీకరించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 522 ఎకరాల వ్యవహారాన్ని ప్రస్తావించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం జరిగిందని, ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అయితే, అధికారుల అవగాహనా లోపం, రికార్డుల గందరగోళం వల్ల ఏ పాపం ఎరుగని సామాన్య కొనుగోలుదారులు ఎందుకు శిక్ష అనుభవించాలన్న ప్రశ్నకు మాత్రం మంత్రి వద్ద స్పష్టమైన జవాబు కరువైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏడాది ఏప్రిల్ 22న జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు చూపిస్తూ ఒక నకిలీ మెమోను, మరోచోట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించిన ఉదంతాలను ప్రస్తావిస్తూ.. నకిలీ జీవోలు, బోగస్ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారన్న నెపాన్ని చూపుతూ, మొత్తంగా 22ఏ కింద లక్షలాది ఎకరాలను బ్లాక్ చేయడాన్ని ప్రభుత్వం గట్టిగా వెనకేసుకొచ్చింది. యుఎల్సీకి దరఖాస్తు చేసుకోని, క్లియరెన్స్ పొందని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనని చెప్పడం ద్వారా.. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడిన వారి ఆశలపై నీళ్లు చల్లారు.
22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు 1,162 కాల్స్ మాత్రమే వచ్చాయని, రిపీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. వీటిలో 547 వ్యవసాయ భూములు, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి 258, మేడ్చల్ మల్కాజిగిరి నుంచి 149, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 44, యాదాద్రి భువనగిరి నుంచి 40, సిద్దిపేట నుంచి 35 కాల్స్ వచ్చినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22ఏపై కొన్ని పత్రికల్లో వస్తున్నట్టుగా తీవ్ర సమస్య లేదని అన్నారు. 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, కేవలం 12-13 కేసులు మాత్రమే తిరసరించామని పేర్కొన్నారు.