హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉన్న మద్యం దుకాణాన్ని అధికార పక్ష ముఖ్యనేత సన్నిహితుడికి గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టిన వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ భుజాలు తడుముకుంటున్నది. ఖరీదైన మద్యం విక్రయాలు జరిగేందుకు అవకాశం ఉన్న మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ పెద్దలు గద్దలకు కట్టబెట్టిన తీరును బట్టబయలు చేస్తూ ‘ముఖ్యనేత స్నేహితుడికి టానిక్ నజరానా’ అనే శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ చీకటి బాగోతం రాష్ట్ర సచివాలయంలో కలకలం రేపింది. తమ దొంగాటను సమర్థించుకునేందుకు సికింద్రాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారి పేరుతో ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు ఎక్సైజ్ అధికారి జీవన్కిరణ్. లేఖపై ఆయన పేరు గానీ, సంతకం కానీ లేకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం అంతర్గతంగా జరిపిన ప్రాథమిక విచారణలో లోగుట్టు బయటపడ్డట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదాయం భారీగా నష్టపోయినట్టు అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
గెజిట్ నోటిఫికేషన్ను సికింద్రాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం, జూబ్లీహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రచురించామని అధికారులు ఖండన లేఖలో చెప్పుకొచ్చారు. కానీ, తెరవెనుక అసలు వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలే బయటపెట్టాయి. కేవలం సాక్ష్యాధారాల కోసం బోర్డులపై గెజిట్ ప్రతిని పెట్టి, నిమిషాల వ్యవధిలోనే ఫొటోలు తీసుకుని వెంటనే తొలగించారని ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిసింది. ఇంతటి భారీ ఆదాయం తెచ్చిపెట్టే దుకాణానికి పత్రికా ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? ఎక్సైజ్ పోర్టల్ ద్వారా బహిరంగ సమాచారాన్ని ఎందుకు అందుబాటులో ఉంచలేదు? ఈ ప్రశ్నలకు ఎక్సైజ్ ఇచ్చిన వివరణలో ఎకడా జవాబు లేదు. లాటరీలో వచ్చిన ఆ ఆరు దరఖాస్తుల వివరాలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే అవన్నీ ఒకే వ్యాపార గ్రూపునకు, ముఖ్యనేత అనుయాయులకు సంబంధించిన బినామీ దరఖాస్తులేనని తేటతెల్లమవుతుందని వ్యాపారులు చెప్తున్నారు.