హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఆధిపత్యపోరు పీక్కు చేరింది. ముఖ్యంగా సీఎం, స్పీకర్ భేటీ జేఏసీలో చిచ్చురేపింది. వాట్సాప్ వార్‌కు దారితీసింది. ఉద్యమాన్ని అర్ధాంతరంగా విరమించడం.. ‘చలో హైదరాబాద్’ను వాయిదా వేయడంపైనా జేఏసీలో అభిప్రాయబేధాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల నాలుగు కీలక డిమాండ్ల పరిష్కారానికి జేఏసీ ఈ నెల 10న ‘చలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చింది. ఈ నెల 9న సీఎస్ లిఖితపూర్వక హామీతో జేఏసీ నేతలు అర్ధాంతరంగా ‘చలో హైదరాబాద్’ను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 10న జేఏసీ నాయకత్వం ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌తో అసెంబ్లీలో వేర్వేరుగా భేటీ అయ్యింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకత్వం ముఖ్యమంత్రిని కలిసిందంటూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు ప్రత్యక్షం కావడం వివాదానికి దారితీసింది. దీనిపై జేఏసీలోని కొన్ని భాగస్వామ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. పలు వాట్సాప్ గ్రూపుల్లో ఇది వార్‌కు దారితీసింది. 206 సంఘాలతో పటిష్టంగా ఉన్న జేఏసీ ఉద్యమాన్ని తకువ చేసి చూపేలా కొన్ని సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చకర్లు కొడుతుండటంపై జేఏసీ నాయకత్వం స్పందించింది. జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ స్థాయిని తగ్గించేలా, ‘మేమే సాధిస్తాం’ అన్న రీతిలో ప్రచారం చేయడం ఐక్య ఉద్యమానికి నష్టం చేస్తుందని జేఏసీ మండిపడింది. సీఎం, స్పీకర్‌తో భేటీలో ఏ ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రమేయం లేదని స్పష్టంచేసింది. జేఏసీలో భాగస్వామ్య సంఘాలుగా ఉంటూనే ఇలాంటి ప్రచారానికి పాల్పడటం తగదని పేరొన్నది.
రాజకీయ పదవుల ఆశతో, రాజకీయ పార్టీల ప్రమేయంతో, పార్టీల సూచనల మేరకు జేఏసీ ఉద్యమాలు నిర్వహించబోదని తేల్చిచెప్పింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలే తమ ప్రధాన అజెండా అని స్పష్టంచేసింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి పోస్టులు పెట్టినా ఆయా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకత్వం పేర్కొన్నది. ఇష్టంలేని వారు జేఏసీ నుంచి వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించింది. జేఏసీ నాయకత్వం హెచ్చరికలపై పీఆర్టీటీయూ టీఎస్ కూడా గట్టిగానే స్పందించినట్టు సమాచారం.
సీఎంతో భేటీ అనంతరం సర్కార్ మూడు డీఏల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వా ట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. రెండు డీఏలకు ఆమోదమంటూ కొన్ని సంఘాలు వైరల్ చేశాయి. జేఏసీలోని భాగస్వామ్య సంఘాల వాట్సాప్ గ్రూపుల్లోనే ఈ ప్రచారం జరిగింది. ఇదంతా ఉత్తుత్తిదేనని తేలింది. ఒక వైపు డీఏలంటూ ప్రచారం కావ డం.. సర్కార్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఉద్యోగుల జేఏసీకి సంకట స్థితి ఎదురయ్యింది. 18న చర్చల అనంతరం మూడు డీఏలు విడుదల కాకపోతే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని జేఏసీ నాయకత్వం లోలోన మదనపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
‘చలో హైదరాబాద్’ వాయిదాపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. వాయి దా వేయాల్సింది కాదని.. 2022లో ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడను ముట్టడించిన తరహాలో ‘చలో హైదరాబాద్’ను నిర్వహించాల్సి ఉంటే బాగుండునని జేఏసీలోని ఓ సంఘం నేత అభిప్రాయపడ్డారు. సరూర్‌నగర్ స్టేడియానికి బదులు ఇండోర్ స్టేడియానికి అనుమతి ఎలా కోరుతారని మరో నేత ప్రశ్నించారు. జేఏసీ నాయకత్వం ప్రాథమిక సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా నడుస్తున్నదని మరో నేత అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ నెల 18 తర్వాత సర్కార్ ఏం తేల్చకపోతే మళ్లీ ఉద్యమానికి పిలుపు ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితికి తీసుకొచ్చారని మరో నేత ఫైర్ అయ్యారు. 18 వరకు సమయమిచ్చిన తర్వాత.. సీఎం, స్పీకర్, పీఆర్సీ కమిటీ చైర్మన్, సీఎస్‌ను జేఏసీ నాయకత్వం కలువాల్సిన అవసరమేముందని మరో నేత ఫైర్ అయ్యారు. ‘చలో హైదరాబాద్’ అంటూ తొడగొట్టిన వారు.. ఇప్పుడు సర్కార్ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని మరో నేత ఆగ్రహం వ్యక్తంచేశారు.