రంగారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 22 ఏ నిషేధిత జాబితాపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాబితా తయారీలో దొర్లిన తప్పులపై పునఃసమీక్ష చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిగిలిన అన్ని పనులను పక్క నపెట్టి తహసీల్దార్ కార్యాలయాల్లో గత జాబితా, ప్రస్తుత జాబితాను పరిశీలిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, బాలాపూర్, గండిపేట, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములతోపాటు స్థిరచరాస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు.
జాబితా సవరించే క్రమంలో రికార్డులను సరిగ్గా పరిశీలించకుండానే ఆ జాబితాలో చేర్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు అనేక క్రయవిక్రయాలు జరిగిన ప్లాట్లు, వ్యవసాయ భూములనూ ప్రొహిబిటేడ్ లిస్ట్‌లో చేర్చినట్టు బాధితులు వాపోతున్నారు. తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో కొన్నేండ్ల కిందట కొన్న ప్లాట్లు, ఇండ్లనూ నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ప్లాట్లు కొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మించిన ఇండ్లను సైతం ఈ జాబితాలో చేర్చడంతో వాటి యజమానులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 24 : కూకట్పల్లి మండలంలో 22ఏ నిషేధిత భూముల సమస్య, హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు, ప్రజా సమస్యలపై బాధితులతో బుధవారం ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు తెలిపారు. వసంతనగర్ డివిజన్లోని ఎన్ఆర్ఎస్ఏ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పార్టీకలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హాజరుకానున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నిషేధిత జాబితాలో జరిగిన తప్పులను సరిచేస్తామంటూ కొందరు పైరవీకారులు ప్రజలను మభ్యపెడుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ విషయంపై రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పందించి నిషేధిత జాబితా విషయంలో బ్రోకర్లను నమ్మొద్దని.. ఆధారాలు చూపిస్తే జాబితా నుంచి తామే తొలగిస్తామని ప్రకటించారు.
22ఏ నిషేధిత జాబితాపై క్షేత్రస్థాయిలో అధికారులు పునఃసమీక్ష చేస్తున్నారు. జాబితాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రికార్డులతోపాటు క్షేత్రస్థాయిలో భూములపై ఉన్న రైతులను గుర్తిస్తున్నారు. కాగా, నిషేధిత జాబితా లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అన్ని పనులను పక్కనెట్టి కొత్త లిస్టు తయారీలో తహసీల్దార్లు నిమగ్నమయ్యారు.
నిషేధిత జాబితా తయారీ పేరుతో ప్రభుత్వం ప్రజల స్థిరాస్తులను కైవసం చేసుకునే కుట్రకు తెరలేపింది. రెవెన్యూ అధికారుల అవగాహన రహిత్యంతో కోట్ల రూపాయల విలువచేసే ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. జరిగిన అవకతవకలను సరిచేయడంతోపాటు నిషేధిత జాబితాను పూర్తిగా రద్దుచేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రతరం చేస్తాం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే