కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పప్పు బెల్లాల్లా అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట దందాకు తెరతీసింది. గ్రేటర్ వ్యాప్తంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లను అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు, వారి అనుచరులు ఈ అక్రమ దందాకు తెరలేపారు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందాలో మొత్తం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అనుచరులే ఉన్నారు. అధికార పక్షం కావడంతో అధికారులు తాము చెప్పనట్లు వింటారని, కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలని, లాటరీలో పేరు రాకున్నా ఇల్లు వచ్చేలా చూస్తామంటూ మభ్యపెడుతున్నారు. దీంతో కొంతమంది బయట ఫ్లాట్లు కొనుక్కునే బదులు ప్రభుత్వం నిర్మించబోయే ఇందిరమ్మ పథకంలో వస్తుందని.. వాళ్లు అడిగినంత ముట్టజెప్తున్నారు.
ఇప్పటికే వేలాది మంది నుంచి అడ్వాన్సుల రూపంలో లక్షలాది రూపాయలు చేస్తున్నారు. రాయదుర్గం, జూబ్లీహిల్స్, కూకట్పల్లి వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఏకంగా రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మిగతా ప్రాంతాల్లో ఏరియాను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ధరను నిర్ణయించి లాటరీలో పేరు రాకున్నా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల సిఫార్సులతో ఇల్లు వచ్చేలా చేస్తామని నమ్మబలుకుతున్నారు. అక్రమార్కుల మాయమాటల వలలో పడి మధ్యతరగతి ప్రజలు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును వారికి కట్టబెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు మీసేవా కేంద్రాలకు కొద్దిరోజులుగా వరుస కడుతున్నారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలమని చెప్పుకొంటూ కొంతమంది మీసేవా కేంద్రాలు, హౌసింగ్ బోర్డు కార్యాలయం ముందు తిష్టవేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని సంప్రదిస్తూ ఇండ్లు వచ్చేందుకు ప్రభుత్వానికి చెల్లించే రూ.6 లక్షలతో పాటు మరికొంత డబ్బు చెల్లిస్తే కచ్చితంగా వచ్చేలా చూస్తామని మభ్యపెడుతున్నారు. దీంతో దరఖాస్తు చేసుకునేవారంతా ఇంకో 2-3లక్షల రూపాయలు పోయినా సరే.. ఇల్లు వస్తే చాలనుకుని అక్రమార్కుల వలలో చిక్కుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల మీసేవ కేంద్రాల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసకున్నవారి వివరాలను తీసుకుంటున్నారు. వారికి ఈ అక్రమార్కులు ఫోన్లు చేస్తూ.. మేం మంత్రి లేదా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అనుచరులమంటూ పరిచయం చేసుకుంటున్నారు.‘మీకు లాటరీలో పేరు రాకున్నా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం.. అందుకు కొంత ఖర్చు అవుతుంది’ అంటూ గాలం వేస్తున్నారు. మరోవైపు హౌసింగ్ బోర్డు అధికారులు తాము చెప్పిన వారికే ఇండ్లు కేటాయిస్తారని చెప్పుకొంటూ మరికొమంది దళారులు దందా సాగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెడుతూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.