లక్నో: ఒక వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. పార్టీలో ఉన్న ఆయన కోడలు హంతకులకు దిశానిర్దేశం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులతో పాటు ఆ మహిళను కూడా అరెస్ట్ చేశారు. పార్టీలకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడంపై మామ నిఘా, ఇంటి ఖర్చులపై పెత్తనం లేకపోవడం వంటి కారణాలు ఈ హత్యకు కారణాలని పోలీసులు తెలిపారు. (Kanpur Businessman Murder) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 5న రాత్రివేళ కాన్పూర్‌లోని సంపన్న ప్రాంతమైన ఇందిరా నగర్‌లోని తన ఫ్లాట్‌లో 63 ఏళ్ల వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను 26 స్లారు కత్తితో పొడిచి చంపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పార్టీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు, కోడలు వినీత్ రక్తంమడుగుల్లో మరణించడాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, బిజినెస్ మ్యాన్ వినీత్ హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత బయటవ్యక్తులు చేసిన హత్యగా భావించారు. ఇంట్లో విలువైన వస్తువులు లేదా నగదు చోరీ కాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా శనివారం రాత్రి సుమారు 9:30 గంటలకు వినీత్ కుమారుడు సుబ్రత్, కోడలు షాలు, వారి ఆరేళ్ల కుమారుడు పార్టీ కోసం ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి చొరబడి లోపల దాక్కున్నారు.
అయితే శనివారం రాత్రి 10.58 గంటలకు వినీత్ ఇంటికి తిరిగి వచ్చారు. సుమారు గంటన్నర పాటు లోపల ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఆయనకు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో వారు కత్తులతో ఆ వ్యాపారిపై దాడి చేశారు. వినీత్ మెడ, ఛాతీపై 26 సార్లు కత్తులతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు వినీత్ ఇంట్లో సుమారు 13 ఏళ్లు పని చేసిన మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్, అతడి అనుచరుడు రాజ్ కిషోర్‌ను హంతకులుగా గుర్తించారు. ఎన్కౌంటర్ తర్వాత ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా వ్యాపారి వినీత్ హత్యకు ఆయన కోడలైన 36 ఏళ్ల షాలు కుట్రపన్నినట్లు బయటపడింది. మామ హత్య కోసం ఆమె రూ.6 లక్షలకు విశాల్‌తో ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించింది. దీంతో విశాల్ డూప్లికేట్ కీ ద్వారా తన అనుచరుడితో కలిసి ఆ ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు.
కాగా, వినీత్ నిద్రిస్తున్నప్పుడు దిండుతో ఊపిరి ఆడకుండా చేసి సహజ మరణంగా చిత్రీకరించాలన్నది నిందితుల కుట్ర అని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న ఆయనకు విశాల్, రాజ్ కిషోర్ ఎదురుపడటంతో వారి ప్రణాళిక మారిందని చెప్పారు. వారిద్దరూ కత్తులతో ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు. భర్తతో కలిసి పార్టీలో ఉన్న కోడలు షాలు ఫోన్లో విశాల్‌కు సూచనలు ఇచ్చినట్లు కాల్ రికార్డ్స్ ద్వారా బయటపడిందన్నారు.
మరోవైపు రాత్రుళ్లు పార్టీలకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడంపై సీసీటీవీల ద్వారా మామ వినీత్ నిఘా పెట్టడం, ఇంటి ఖర్చులపై పెత్తనం లేకపోవడం వంటి కారణాలతో కోడలు షాలు ఆయన హత్యకు కుట్రపన్నిందని పోలీస్ అధికారి తెలిపారు. మే 1 నుంచి హత్య జరిగిన రోజు వరకు షాలు, విశాల్ మధ్య మొత్తం 309 సార్లు టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ జరిగాయని చెప్పారు. ఈ సంభాషణలలో వాట్సాప్ కాల్స్ కూడా ఉన్నాయని వివరించారు. మామ హత్య కుట్రలో తన పాత్రను దాచిపెట్టే వ్యూహంలో భాగంగానే షాలు తన భర్తతో కలిసి పార్టీకి వెళ్లినట్లు తెలుస్తున్నదని పోలీస్ అధికారి అన్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.