Car Catches Fire : విజయవాడ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై తీవ్ర కలకలం రేగింది. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అది పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ డాక్టర్ తన కారును మరమ్మతుల నిమిత్తం మహానాడు రోడ్డులోని ఓ మెకానిక్ షెడ్లో ఇచ్చారు. రిపేర్ల అనంతరం మెకానిక్ సురేశ్, కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు బయటకు తీశాడు.
స్క్యూ బ్రిడ్జి వద్ద యూ-టర్న్ తీసుకుని బెంజ్ సర్కిల్ కొత్త వంతెనపైకి రాగానే, కారు ముందు భాగం నుంచి దట్టమైన పొగలు రావడం మొదలైంది. ఇది గమనించిన ఇతర వాహనదారులు అతడిని హెచ్చరించారు. దాంతో అప్రమత్తమైన మెకానిక్ సురేశ్ వెంటనే కారును పక్కకు ఆపి, కిందకు దిగిపోయాడు. అతను దిగిన క్షణాల్లోనే మంటలు వేగంగా కారు మొత్తం వ్యాపించాయి. పెద్ద శబ్దాలతో కారు టైర్లు పేలడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. చూస్తుండగానే కారు మంటల్లో పూర్తిగా కాలిబూడిదైంది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం.. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.