సోమవారం 01 మార్చి 2021
Siddipet - Nov 01, 2020 , 23:40:47

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం

ప్రత్యర్థులకు అందనంత దూరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ

ప్రచారంలో దూసుకుపోయిన కారు..

దుబ్బాక గులాబీ దళంలో జోష్‌.. వార్‌ వన్‌సైడ్‌

రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌ల ఆరాటం

రేపు పోలింగ్‌... 10న కౌంటింగ్‌ 

దుబ్బాకలో గులాబీ జోష్‌...

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జోష్‌ మీద ఉంది. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ప్రచారంలో దూసుకుపోయింది. 20-25 రోజులుగా పల్లెల్లో గులాబీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి మండల కేంద్రాల్లో నిర్వహించిన సభలతో పాటు గ్రామగ్రామాన ప్రజలు బతుకమ్మలు, జలపందిరిలు, వివిధ రూపాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డికి స్వాగతం పలికారు. ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విడమర్చి చెప్పడంతో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేస్తున్న గోబెల్‌ ప్రచారాలను ఎండగట్టారు. ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలకు మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరితే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక తోక ముడిచారు. ఇలా ఎక్కడికక్కడికి ప్రతిపక్ష పార్టీల నాయకుల తీరును ఎండగట్టి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో ప్రజల ముందుంచారు. గ్రామాల్లోని యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కనీసం ఆ పార్టీలకు గ్రామాలకు క్యాడర్‌ లేకపోవడంతో పరాయి లీడర్లు.., కిరాయి మనుషులతో ఆ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ప్రజాధరణ లేకపోవడంతో నిరాశ నిసృ్పహలతో విష ప్రచారాలకు తెరలేపారు. అన్నీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ మద్దతు ఇస్తామంటూ ఆయా గ్రామాల్లో ఓటర్లు బహిరంగగానే చెబుతున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ దాటడంతో పాటు వార్‌ వన్‌సైడ్‌ లాగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికకు సంబంధించి ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల కమీషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 3న మంగళవారం పోలింగ్‌ జరుగనున్నది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘నోటా’తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. ఒక్కో బూత్‌లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. రేపు పోలింగ్‌ నిర్వహించి, ఈనెల 10న సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌటింగ్‌ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలంతా వారివారి సొంత స్థలాలకు వెళ్లిపోయారు. 20 రోజులుగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరుఫున ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను గులాబీ సైన్యం తీసుకెళ్లింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు కడిగి పారేశారు. ఒక దశలో రాజీనామాల వరకు సవాల్‌లు వెళ్లాయి. మంత్రి విసిరిన సవాల్‌కు బీజేపీ నాయకులు తోక ముడిచారు. ఇక ప్రతి పక్ష పార్టీలు పరాయి లీడర్లు.. కిరాయి మనుషులు అన్నట్లుగా ప్రచారం సాగింది. 


గడప గడపకూ 

సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు...

దుబ్బాక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడపగడపకూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీసుకెళ్లారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి ఉప ఎన్నికల్లో గులాబీ దండు తమ ప్రచారం నిర్వహించింది. దుబ్బాక నియోజకవర్గంలో రూ.800 కోట్లతో ఇంటింటా తాగునీరు అందించి ప్రజల నీటిగోసను తీర్చింది. వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ప్రతి ఎకరాకు రానున్నాయని తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే తొగుట, దుబ్బాక మండలాల్లోని కొన్ని చెరువులను గోదావరి జలాలతో నింపింది. ప్రధాన కాల్వల నిర్మాణంతో పాటు పిల్ల కాల్వల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి రైతుబంధు పథకం కింద 76,912 మంది రైతులకు గాను రూ.77,60,01,852 లను ఈ వానకాలంలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతుకు ఆసరాగా నిలిచింది. యాసంగి పంటకు సైతం దీపావళి పండుగ వేస్తుందని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా కింద ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పన ఆ కుటుంబాలకు అందించి భరోసానిచ్చింది. చేనేత, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందించింది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 52,823 మందికి పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. పేదింట ఆడపిల్ల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి పథకం కింద 5,599 మందికి, షాదీ ముబారక్‌ కింద 322 మందికి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందించి ఆదుకున్నది. నియోజకవర్గంలో కేసీఆర్‌ కిట్టు కింద 29,083 మంది మహిళలు లబ్ధి పొందారు.

హోరాహోరీగా ఉప ఎన్నిక ప్రచారం..

దుబ్బాక ఉప ఎన్నికల్లో 20 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా తమ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దుబ్బాక ఉప ఎన్నిక ఇన్‌చార్జ్జి, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విస్తృతంగా పర్యటించారు. అన్నీ తానై ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుందని మంచి జోష్‌లో ఉంది. ప్రచారం చివరిరోజు దుబ్బాకలో మీడియా సమావేశంలో మాట్లాడి, బీజేపీ నేతల చేరికల అనంతరం రాయపోల్‌, దౌల్తాబాద్‌, మిరుదొడ్డి, దుబ్బాకలో జరిగిన సభలు, రోడ్‌షోల్లో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తరఫున కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, బట్టి విక్రమార్క, హన్మంతరావు, జీవన్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరుఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ నాయకులు జితేందర్‌రెడ్డి, వివేక్‌, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో వివిధ పార్టీల నాయకులు తమ స్వస్థలాలకు బయలుదేరి పోయారు. 


VIDEOS

logo