శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 06, 2020 , 23:13:19

సర్కారు దవాఖానలోనే సుఖ ప్రసవం

సర్కారు దవాఖానలోనే సుఖ ప్రసవం

  • ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు
  • కార్పొరేటుకు దీటుగా వైద్య సేవలు
  • కరోనా సమయంలోనూ వైద్యులు, సిబ్బంది విధులు
  • సిద్దిపేట జిల్లాలో ఆరు నెలల్లో 5652 డెలివరీలు
  • వీటిలో 2,330 సాధారణ, 3,322 సిజేరియన్లు
  • సంగారెడ్డిలో ఆగస్టు వరకు 8,642 కాన్పులు
  • 5,330 నార్మల్‌, 3,204 సిజేరియన్‌
  • సిజేరియన్‌ డెలివరీలు 37.1శాతం
  • గతంతో పోల్చితే సాధారణ ప్రసవాలే ఎక్కువ
  • కేసీఆర్‌ కిట్టుతో మంచి ఫలితాలు

సమైక్య రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’.. అనే నానుడి ఉండేది.. ఇవాళ ‘నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే రోజులు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు అందుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాకతో పాటు ఇతర దవాఖానల్లో రోజురోజుకు చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్టుతో కరోనా సమయంలోనూ ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మెరుగైన వైద్యం అందుతున్నది. గతంతో పోల్చుకుంటే సాధారణ ప్రసవాలు పెరిగాయి. సిద్దిపేట జిల్లాలో మార్చి -1 నుంచి (కరోనా ప్రారంభం నుంచి ) ఈ నెల 3వ తేదీ(ఆరు నెలల కాలంలో) వరకు మొత్తం 5,652 ప్రసవాలు జరుగగా, వీటిలో 2,330 సాధారణ, 3,322 సిజేరియన్లు అయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌ దవాఖానలో సాధారణ ప్రసవాలు జరిగాయి. ఈ ఆరు నెలల్లో 1890కి గానూ 1017 సాధారణ ప్రసవాలయ్యాయి.

కార్పొరేట్‌ స్థాయిలో సేవలు..

సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయిలో గర్భిణులు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రైవేట్‌లో అత్యవసరం కాకున్నా, సిజేరియన్లు చేసి, వేలకు వేలు దోచుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నది. కేసీఆర్‌ కిట్టు పథకాన్ని 2017 జూన్‌ 3న ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రసవం అనంతరం మహిళకు రూ.2వేల విలువైన 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్టును ప్రభుత్వం అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు ఇంటికెళ్లేందుకు ‘అమ్మ ఒడి 102’ వాహనం సైతం అందుబాటులో ఉంది. ఆ వాహనంలో తల్లీబిడ్డా క్షేమంగా ఇంటికి చేరుతున్నారు.   కరోనా నేపథ్యంలో అత్యధికంగా ప్రభుత్వ దవాఖానలకే వెళ్తున్నారు. వైద్యులు కల్పిస్తున్న అవగాహన మేరకు సిజేరియన్‌ కన్నా సాధారణ ప్రసవాలకే మహిళలు మొగ్గుచూపుతున్నారు.  

సిద్దిపేట జిల్లాలో 5,652 ప్రసవాలు

సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాలలో మొత్తం 41 దవాఖానల్లో 5,652 ప్రసవాలు జరిగాయి. వీటిలో 2,330 సాధారణ, 3,322 సిజేరియన్లు జరిగాయి. ఇప్పటివరకు 4,879 మందికి కేసీఆర్‌ కిట్లను అందజేశారు. సిద్దిపేట(ఎంసీహెచ్‌)లో మొత్తం 3045 కి గానూ 830 సాధారణ, 2215 సిజేరియన్లు, గజ్వేల్‌ దవాఖానలో 1890కి గానూ 1017 సాధారణ, 873 సిజేరియన్లు, దుబ్బాక (సీహెచ్‌సీ)లో 232కు గానూ 86సాధారణ, 146 సిజేరియన్లు, చేర్యాల(సీహెచ్‌సీ)లో 118కి గానూ 30 సాధారణ, 88 సిజేరియన్లు జరిగాయి. ఇక హుస్నాబాద్‌ (యూపీహెచ్‌సీ)లో 76, భూంపల్లి(పీహెచ్‌సీ)లో 23, జగదేవ్‌పూర్‌(పీహెచ్‌సీ)లో 31, కుకునూర్‌పల్లి(పీహెచ్‌సీ)లో 22, ములుగు(పీహెచ్‌సీ)లో 13, నంగునూరు (సీహెచ్‌సీ)లో 17, పుల్లూరు(పీహెచ్‌సీ)లో 12, రాయిపోల్‌(పీహెచ్‌సీ)లో 7, సింగన్నగూడెం (పీహెచ్‌సీ)లో 9, తీగుల్‌(పీహెచ్‌సీ)లో 49, తిమ్మాపూర్‌(పీహెచ్‌సీ)లో 37, వర్గల్‌(పీహెచ్‌సీ)లో 41 సాధారణ ప్రసవాలు జరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు.

సంగారెడ్డిలో 8,642 కాన్పులు

సంగారెడ్డి జిల్లాలో జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 8,642 ప్రసవాలు జరుగగా, ఇందులో 5,330 నార్మల్‌, 3,204 సిజేరియన్లు జరిగాయి. 108 చిన్నపాటి ఆపరేషన్లు జరుగగా, సిజేరియన్‌ డెలివరీల శాతం 37.1గా నమోదైంది. మాతా, శిశు మరణాల సంఖ్య ఏమీలేదు. జిల్లాలో సంగారెడ్డి జిల్లా దవాఖాన, పటాన్‌చెరు, జహీరాబాద్‌లో ఏరియా దవాఖానలతో పాటు నారాయణఖేడ్‌, జోగిపేట, సదాశివపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లా దవాఖానలో మొత్తం 4,800 డెలివరీలు జరుగగా, 2,896 నార్మల్‌, 1,904 సిజేరియన్లు అయ్యాయి. నారాయణఖేడ్‌ లో 496 నార్మల్‌, జోగిపేటలో 386 నార్మల్‌, 79 సీజేరియన్‌, జహీరాబాద్‌లో 2,092కు గానూ 1,110 నార్మల్‌, 18 చిన్నపాటి సిజేరియన్‌, 964 సిజేరియన్లు, సదాశివపేట 170 నార్మల్‌, 42 సిజేరియన్లు జరిగాయి. పటాన్‌చెరులో మొత్తం 5,77కు గానూ 272 నార్మల్‌, 90 చిన్నపాటి సిజేరియన్‌, 215 సిజేరియన్లు అయ్యాయి. 

VIDEOS

logo