ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 10, 2020 , 23:27:12

జిల్లాలో జోరుగా రైతు వేదికల భవన నిర్మాణం

జిల్లాలో జోరుగా రైతు వేదికల భవన నిర్మాణం

రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులను సంఘటితం చేయడానికి రైతు వేదికలు నిర్మిస్తున్నది. ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున, రూ. 22 లక్షల వ్యయంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 321 రైతు వేదికలు నిర్మిస్తున్నది. ఇందులో 247 చోట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు చేపడుతున్నారు. రైతులంతా ఒక్క దగ్గర చేరి పంటల సాగు, మార్కెటింగ్‌ విధానాల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించుకోవడానికి వీలుగా వీటిని నిర్మిస్తున్నారు. సమావేశానికి వీలుగా హాల్‌తో పాటుగా రెండు గదులు, టాయిలెట్స్‌ నిర్మిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక, సిమెంట్‌ను సరఫరా చేస్తున్నది. 

 ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జోరుగా పనులు కొనసాగుతున్నాయి. రైతులంతా ఒక్క దగ్గర చేరి పంటల సాగు విధానాలు, మార్కెటింగ్‌, పథకాలు, కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించుకోవడానికి రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రైతాంగాన్ని సంఘటితం చేయడానికి ఇవి పని చేయనున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 321 రైతు వేదికలకు గానూ 247 చోట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక్కోటి రూ. 22 లక్షలతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు చేపడుతున్నారు.  - సిద్దిపేట, నమస్తే తెలంగాణ

రైతులంతా ఒక్క దగ్గర సమావేశమై మార్కెటింగ్‌, వ్యవసాయంలో నూతన విధానాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, తదితర అంశాల గురించి చర్చించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో మే 29న రైతు వేదికల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మొత్తం 321 రైతు వేదికలకు గానూ, ఇప్పటి వరకు 247 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 127 రైతు వేదికలకు గానూ, 87 రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో 118 భవనాలకు గానూ 90 చోట్ల, మెదక్‌ జిల్లాలో 76 భవనాలకు గానూ 70 రైతు వేదిక భవన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారుల తెలిపారు. వచ్చే వానకాలం పంట చేతికి వచ్చే సమయానికి రైతు వేదిక భవనాల్లో రైతులు  సమావేశమయ్యేలా వేగంగా పనులు చేయిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వరుస సమీక్షలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలుపాలని చెబుతున్నారు. కొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చి రైతు వేదికలు నిర్మిస్తున్నారు. కలెక్టర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి రైతు వేదిక భవన నిర్మాణానికి 500 సిమెంట్‌ బస్తాలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో సిమెంట్‌, స్టీల్‌ తదితర సామగ్రిని పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ఫిల్లర్ల గుంతలు తీశారు. అలాంటి చోట ఫిల్లర్లను నిలబెట్టే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇసుక కొరత రాకుండా ముందస్తుగానే తెప్పించారు. వ్యవసాయశాఖ దీనికి నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ పథకంలో పనులు కొనసాగుతున్న కొద్ది, మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద నిధులను విడుదల చేయనున్నది.  

2,046 చదరపు అడుగుల్లో నిర్మాణం...

ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ. 12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి కాగా, మిగతా రూ.10 లక్షలు ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్‌ కంపోనెట్‌ కింద నిధులు విడుదల చేస్తారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, గ్రామ, మండల కమిటీ కోఆర్డినేటర్లు అంతా ఒకేచోట కూర్చుండి చర్చించుకునేందుకు వీలుగా, హాల్‌ను 1,496 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ హాల్‌లో సుమారు 154 మంది వరకు రైతులు కూర్చోవచ్చు. హాల్‌తో పాటు రెండు గదులు, టాయిలెట్స్‌ నిర్మిస్తారు. ఇందులో ఒక గదిలో వ్యవసాయశాఖ అధికారి కూర్చుంటారు. ఆ గదిలోనే కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునేందుకు వీలుగా కంప్యూటర్లు, టీవీలను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలను సమకూర్చుతారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు కలిపి ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను ప్రభుత్వం నియమించింది. రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండి, నిరంతరం వారికి సూచనలు, సలహాలు, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో తోడ్పాటును అందిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రైతులకు చేరేలా చూస్తారు.

వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం.. 

సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికల నిర్మాణాలు అన్నిచోట్ల ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చేలా పనులు చేపడుతున్నాం. ఒక్కో రైతు వేదిక భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 లక్షలు మంజూరు చేసింది. నిధులు విడుదలయ్యాయి. ప్రతి రైతు వేదిక నిర్మాణానికి 500 సిమెంట్‌ బస్తాలను అందిస్తాం. భవన నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాం. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. రైతు వేదిక భవనాలు రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారనున్నాయి. - శ్రవణ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సిద్దిపేట logo