మామిళ్లగూడెం, ఏప్రిల్ 25 : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభం కాగా.. గురువారం చివరి రోజు నాటికి దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాలను ఎన్నికల అధికారులు శుక్రవారం పరిశీలించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు చెందిన ఒక సెట్ నామినేషన్ పత్రాలను బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, దిలీప్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తరఫున ఆయన అనుచరులు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం అర్జున్‌రాజు, యువతరం పార్టీ అభ్యర్థిగా గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు.
జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా బట్టు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా మల్లంపాటి సూర్యనారాయణ, ఉల్లెంగుల యాదయ్య, వడితియా వినోద, ఖలీల్ పాషా, మహ్మద్ రసూల్, మారం వెంకట్‌రెడ్డి, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థిగా చిలుకబత్తిని స్టాలిన్, స్వతంత్ర అభ్యర్థిగా రవిచంద్రహన్, గోండువాన దండకారణ్య పార్టీ అభ్యర్థిగా శెట్టుపల్లి శ్రీను ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బండారు నాగరాజు, తంబళ్ల రవి, గంగిరెడ్డి కోటిరెడ్డి, తాండ్ర ఉపేందర్ ఒక సెట్ నామినేషన్ వేశారు. చివరి రోజు అభ్యర్థులు ఎక్కువ మంది రావడంతో సాయంత్రం 6.30 గంటల వరకు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ వారి నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు.