ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. గడిచిన పదేళ్లలో దేశ ప్రజలకు చేసిందేమీలేదని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత ఖమ్మం ఆర్వో కార్యాలయ మీడియా పాయింట్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముందుగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.
జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరి అభిప్రాయం మేరకు ఖమ్మం అభ్యర్థి ఎంపిక జరిగిందన్నారు. సోనియాగాంధీ దూతగా వచ్చిన రఘురాంరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అనంతరం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే చివరి రోజున రఘురాంరెడ్డికి తమ పార్టీ టికెట్ ప్రకటించిందని అన్నారు.
ఖమ్మం పార్లమెంటు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ నియోజకవర్గ పక్షాన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థికి ఈ జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పేందుకే కాంగ్రెస్‌తో తమ పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మానికి తాను కొత్తవాడిని కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాందాస్‌నాయక్, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, పిడమర్తి రవి, జావేద్, సోమ చంద్రశేఖర్, సీపీఎం, సీపీఐ నేతలు నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, ఏప్రిల్ 25: చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాలను కాపాడడం, నేర కార్యకలాపాలను కట్టడి చేయడం వంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన పోలీసు విధుల్లో చట్టాలు, నిబంధనలపై పూర్తి అవగాహన ఎంతో అవసరమని సీపీ సునీల్‌దత్ పేర్కొన్నారు. అలాగే ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. తొమ్మిది నెలల పోలీస్ శిక్షణలో భాగంగా సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు నెలల శిక్షణ పూర్తి చేసుకొని.
ముందుకు వెళ్తున్న సివిల్ ైస్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) శిక్షణ కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలు, బందోబస్తు విధివిధానాలు, శిక్షణ అంశాలపై పోలీస్ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ మీట్లో సీపీ మాట్లాడారు. ఇప్పటికే మూడు నెలల శిక్షణలో ఇన్డోర్, అవుట్ డోర్ శిక్షణలో మంచి తర్ఫీదు పొందుతున్నారని అన్నారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు ఎన్నికల విధులు, విధివిధానాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఏడీసీపీలు గణేష్, విజయబాబు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.