మంగళవారం 26 మే 2020
Siddipet - May 23, 2020 , 00:49:58

మిర్చి.. కలిసొచ్చి..

మిర్చి.. కలిసొచ్చి..

చిన్నకోడూరు మండలంలో 6వేల ఎకరాల్లో సాగు

 గంగాపూర్‌, మాచాపూర్‌ గ్రామాల్లో మిర్చి మార్కెట్‌

 ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు తరలింపు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : చిన్నకోడూరు మం డల రైతులకు మిర్చి పంట కలిసొస్తున్నది. మిర్చి సా గుతో రైతుల ఇంట సిరుల పంట పండుతున్నది. ఇ క్కడి మిర్చి, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నది. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌, మాచాపూర్‌ గ్రామాల్లో మిర్చి మార్కెట్‌ ఉన్నది. ఇక్కడికి మహారాష్ట్ర, నాందేడ్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోళ్లు చేస్తుండగా, పదేండ్లుగా ఇక్కడ మిర్చి మార్కెట్‌ సాయంత్రం వేళ కొనసాగుతున్నది. జిల్లాలో సుమారుగా 32 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు కాగా, ఒక్క చిన్నకోడూరు మండలంలోనే సుమారుగా 6వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. గత వానకాలంలో జిల్లాలో 9,800 ఎకరాల్లో, యాసంగిలో 22,500 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిలో టమాట 12 వేల ఎకరాల్లో, మిర్చి 6వేల ఎకరాల్లో సాగు చేశారు. సిద్దిపేట రూరల్‌, అర్బన్‌, చిన్నకోడూరు, నంగునూరు, తొగుట, ములుగు, గజ్వేల్‌, మండలాలతో పాటు  వర్గల్‌, అక్కన్నపేట మండలాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల పండిస్తున్నారు. ముఖ్యంగా టమాట, చిక్కుడు, మిర్చి, బీరకాయ, కాకర, బెండ, సొరకాయ తదితర పంటలను సాగు చేస్తుంటారు. ములుగు మండలంలో వివిధ రకాల కూరగాయలు 4 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో మంచి లాభాలు రావడంతో రైతులు ఆ దిశగానే సాగుతున్నారు. కూరగాయల సాగుకు డ్రిప్‌, స్ప్రింక్లర్లను వినియోగిస్తున్నారు.

మహారాష్ట్రకు మన మిర్చి..

సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంతో పాటు పక్కనే ఉన్న మండలాల్లో ఎక్కువగా మిర్చి పంటను సాగు చేస్తున్నారు. దీంతో చిన్నకోడూరు మండలం లోని గంగాపూర్‌, మాచాపూర్‌ గ్రామాల్లో మిర్చి మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. పదేండ్లుగా ఇ క్కడ ఫిబ్రవరి నుంచి జూలై వరకు మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులతో పాటుగా పక్కనే ఉన్న సిద్దిపేట, నంగునూరు, బెజ్జంకి తదితర మండలాల నుంచి పెద్దఎత్తున ఇక్కడి రైతులు తమ మిర్చిని తీసుకొచ్చి, అమ్ముతుంటారు. నిజామాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి, మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన మిర్చిని ఎక్కువగా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఈ మధ్యకాలంలోనే వివిధ గ్రామాల నుంచి సుమారుగా 600వ్యాన్‌ల లోడ్‌ మిర్చిని కొనుగోలు చేసినట్లు వ్యాపారులు చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట ప్రాంతాలకు మిర్చిని పంపిస్తారు. ప్రస్తుతం కిలో మిర్చికి ధర రూ.18-రూ.20 పలుకుతుంది. ప్రతి పది కిలోలకు ఒక మడుముగా నిర్ణయించి కాంటా వేస్తారు. తూకం వేయగానే, రైతుకు పట్టీ ఇచ్చి, వారం రోజుల్లోగా ఆ రైతుకు డబ్బులను చెల్లిస్తారు. మిర్చి పంటలతో మంచి లాభాలున్నాయని రైతులు చెప్పారు. రోజు ఒకే తీరు ధర ఉండదు. ఏ రోజుకు ఆ రోజు ధర మా రుతుంది. గతేడాది ఇదే సమయానికి కిలోకు రూ.50-రూ.60 మధ్య పలికింది.  కరోనా నేపథ్యంలో ధర తక్కువగా పలుకుతున్నదని,  లేకపోతే ఇంకా ఎక్కువ లాభం ఎక్కువగా ఉండేదని సరాసరిగా ఒక కిలోకు రూ.30 ఉంటే మంచి లాభాలుంటాయని రైతులు అంటున్నారు.

మంచి లాభాలున్నాయి.

మిర్చిలో మంచి లాభాలున్నాయి. కొన్నేండ్లుగా సాగు చేస్తు న్నా. 20 గుంట ల్లో పంట చేయ గా, ఇప్పటి వరకు 100బస్తాలు అమ్మాను. ఇంకా పొలంల పంట ఉంది. కరోనాతో కొంత ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం కిలోకు రూ.15 నుంచి రూ.20 ధర వస్తున్నది. వరి ఇతర పంటలకన్నా కూరగాయల సాగులో మంచి లాభాలుంటాయి.

- దేవయ్య, రైతు, మాచాపూర్

వారం రోజులకోసారి..

మా ఊరిలోనే మిర్చి మార్కెట్‌ ఉంది. పదేండ్లుగా ఇక్కడ మార్కెట్‌ నడుస్తున్నది. మేమంతా మిర్చి పంట సాగు చేస్తున్నాం. ఒక ఎకరంలో మిర్చి సాగు చేశా. మంచి దిగుబడి వచ్చింది. మిర్చి కొన్న తర్వాత మాకు వ్యాపారులు ఒక పట్టీ ఇస్తరు. వారం తర్వాత డబ్బులు చెల్లిస్తున్నారు. కరోనాతో మిర్చి ధర కొద్దిగా పడిపోయింది.

- నర్సింహరెడ్డి, మిర్చి రైతు, మాచాపూర్

మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు.

చిన్నకోడూరు మండలంలో ఎక్కువగా మిర్చి పండిస్తారు. మాచాపూర్‌, గంగాపూర్‌లో పదేండ్ల నుంచి మిర్చి మార్కెట్‌ నడుస్తున్నది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు మిర్చి తెచ్చి, అమ్ముతుంటారు. రైతులు మిర్చి అమ్మాక వారం రోజులకు వ్యాపారులు డబ్బులు ఇస్తారు. ఇక్కడి నుంచి మిర్చి ఇతర రాష్ర్టాలకు వెళ్తుంది.

- మునీందర్‌,   రైతు, మాచాపూర్‌


logo