పాటంటే చెవి కోసుకునే వాళ్లు ఉన్నట్టే… కాఫీ అంటే నాలుక కోసుకునేవాళ్లూ ఉంటారు. కాకపోతే నాలుక లేకపోతే తమకు ప్రాణమైన కాఫీని ఎలా తాగుతాం అనే ఆలోచనతో ఆ ప్రయత్నం విరమించుకుంటున్నారు తప్ప, మరోటి కాదు. ఇంట్లోనే కాదు, మీటింగ్‌లో, షూటింగ్లో చివరికి డేటింగ్లో ఉన్నా కూడా కాఫీ కోసం ప్రాణం గుంజుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే అవుటిన్ సంస్థ ‘నానో పోర్టబుల్ ఎస్ప్రెసో మెషిన్’ను తయారు చేసింది. కేవలం 670 గ్రాముల బరువుతో చిన్న వాటర్ బాటిల్ సైజు ఉండే ఇది కాఫీ పొడి, నీళ్లు ఉంటే చాలు చిటికెలో వేడివేడి కాఫీని చేతికి అందిస్తుంది. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 200 కప్పుల కాఫీ చేస్తుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ.. ఇలా మొత్తం అయిదు రంగుల్లో దొరికే ఈ కాఫీ మేకర్‌ను కొనుక్కోవాలంటే outin.com క్లిక్ చేయండి. ఖరీదు రూ.11,700.
మనుషులకే కాదు, బూట్లకూ కవలలు ఉంటాయి. అందులోనూ, ‘ట్విన్’ పేరిట కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. బూట్ల తయారీ సంస్థ క్యాంపర్ తన కలెక్షన్లో ఈ కొత్త ప్రయోగం చేసింది. ‘టేలర్ ట్విన్ మొకసిన్స్’ పేరిట రూపొందించిన ఈ రకం జతలో రెండు షూస్ చూసేందుకు ఒకేలా ఉంటాయి, కానీ అచ్చు గుద్దినట్టు మాత్రం కాదు. కొంచెం తేడాతో కనిపించే కవలల్లా అన్నమాట. గులాబీ, గోధుమ, చాకొలెట్, ఆకుపచ్చ.. రంగుల మిశ్రమంగా ఈ రెండు బూట్లనూ విభిన్నంగా తయారు చేశారు. కొంచెం హీల్ ఉండి, ముందువైపు చతురస్రపు ఆకృతి వచ్చేలా లెదర్‌తో వీటిని రూపొందించారు. ఇవి 24s.comలో దొరుకుతాయి. ధర రూ.14 వేలు.
అందానికి బంధం వేసే బాందినీ ప్రింట్లు ఫ్యాషనబుల్ వస్ర్తాలతోనూ చెట్టపట్టాలు కట్టుకు తిరుగుతున్నాయి. అక్కడ కూడా చెరిగిపోని సౌందర్యపు ముద్రలు వేస్తున్నాయి. అలాంటి ఒక కో- ఆర్డ్ సెట్టే ఇక్కడ కనిపిస్తున్నది.
సాక్షా & కిన్నీ సంస్థ తయారు చేసిన ‘పెరివింకిల్ బాందినీ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్’లో బ్యాట్ వింగ్ (గబ్బిలపు రెక్క) తరహా చేతులు ఉన్న టాప్కు, జిప్పర్ స్లిట్ స్కర్ట్ జతగా వచ్చింది. నీలం, ఎరుపు, గోధుమ వన్నె పూల ప్రింట్కు.. అడ్డ గీతల డిజైన్ తోడు కావడంతో ట్రెండీ లుక్ సాధ్యమైంది. కాటన్, సిల్క్‌తో తయారైన ఈ సెట్ ధర పాతికవేలు. ensembleindia.com వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఆకాశపు పందిరి మీద అల్లిన తాటాకుల్లా ముచ్చటగా మెరిసే మేఘాలను తన కళలో ఆవిష్కరించాలని కలగన్నాడో కళాకారుడు. అచ్చం నీలాంబరాన్ని పోలిన కాన్వాసునే అందుకు ఎంచుకున్నాడు. దానిమీద వెండి మబ్బులను చేతితో చెక్కాడు. ఆ సృజనకు ప్రతిరూపమే ఈ ‘కోబాల్ట్ క్రిస్టల్ జగ్’. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఆ కళాకారుడి పేరు జొనాథన్ హాన్సెన్. తన బృందంతో కలిసి ‘ఇన్ ద క్లౌడ్స్’ పేరుతో తెచ్చిన కలెక్షన్లో
భాగమే ఈ నీళ్ల జగ్గు. లెడ్ ఫ్రీ క్రిస్టల్ గ్లాస్‌తో చేసిన ఈ పనితనం వెనుక ఆకాశాన్నీ, మేఘాన్నీ, నీళ్లనూ ఒక్కచోట చేర్చే ఆలోచన ఉందన్నమాట. ఈ సృజన నచ్చితే modaoperandi.com ద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 54 వేలు.
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు