‘టిక్ టిక్.. గడియారం పన్నెండయ్యిందీ..’ అని పాడాలంటే రెండుసార్లు ఆరు దాటాలంటుందీ సరికొత్త గడియారం. ఇప్పటి దాకా 360 డిగ్రీలు తిరిగిన గంటల ముల్లుకు భిన్నంగా.. ఇందులో 220 డిగ్రీల కోణం మాత్రమే ఉంటుంది. అదే ‘సింట్రీ కర్వెక్స్ రిట్రోగ్రేడ్ అవర్ టర్బిలాన్’ వాచ్. ఫ్రాంక్ ముల్లర్ సంస్థ తయారుచేసిన ఈ వాచీలో రెండుసార్లు ఆరు అంకె ఉంటుంది. అంటే 5.59 వరకూ సవ్యదిశలోనే గంటల ముల్లు తిరుగుతుంది. తర్వాత తన దిశను మార్చుకుని మళ్లీ తొలి ఆరు దగ్గరికి వెళ్తుంది. ఇలా గంటల ముల్లు కేవలం 220 డిగ్రీల కోణంలోనే పరివర్తనం చెందుతుంది. ఇక, ఫ్రాంక్ ముల్లర్ సంస్థ విలాసాన్ని చూపించేలా ఈ గడియారం కేస్ చుట్టూ వజ్రాలను పొదిగారు. రంగురంగుల్లో అంకెలను ఉంచడంతో వాచీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. బెల్టులు కూడా ఆకట్టుకునేలా విభిన్న రంగుల్లో దొరుకుతున్నాయి. ఇక వాచీలో ఎన్ని చిన్నెలద్దినా 24 గంటలకు మించి సమయాన్ని ఒక్క గంటా పెంచలేం అనుకోండి. ఈ లగ్జరీ గడియారం franckmuller.comలో లభిస్తుంది. ప్రైస్ ఆన్ రిక్వెస్ట్ అంటున్నారు తయారీదారులు.
అందాల ఆల్చిప్పలను నగల తయారీలో వాడటం కొన్నేండ్ల నుంచీ చూస్తున్నాం. లాకెట్లూ చెవిపోగులు, ఉంగరాల్లాంటివీ ఈ తరహాలో రూపొందుతున్నాయి. గడియారాల డయల్గానూ ఆల్చిప్పలను వాడుతున్నారు. ఇందులో ఒక అరుదైన రకం.. అబలాన్. ఆకుపచ్చ, నీలం వర్ణాల మేళవింపుగా హానత్ సింగ్ జువెలరీ సంస్థ రూపొందించిన ఉంగరం కళ్లను కట్టిపడేసేలా ఉంది. అబలాన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మంచి ముత్యం మధ్యలో ఉంచి, చుట్టూ వజ్రాలు పొదిగి, రంగు రంగుల రత్నాలను వేలాడదీసి దీన్ని ముస్తాబు చేశారు. వెడల్పుగా గొడుగులా కనిపించే అడుగు బాగాన్నీ నాజూకైన తీగల డిజైన్లలో రూపొందించారు. స్టేట్మెంట్ రింగ్ తరహాలో కనిపిస్తున్న దీన్ని hanutsingh.com వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. ధర వివరాలూ అక్కడే తెలుసుకోవచ్చు.
ట్రెడిషనల్ అయినా, ట్రెండీ అయినా దుస్తులకు ఫ్యాషన్ లుక్ రావాలంటే స్కార్ఫ్ కట్టాల్సిందే. అందుకే, వాటి తయారీలోనూ కొన్ని బ్రాండ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్.. హెర్మెస్ స్కార్ఫ్‌లను కళాత్మకంగా రూపొందించడంలో పేరుమోసింది. తాజాగా, తన అభిరుచిని చాటేలా భిన్న వర్ణాల స్కార్ఫ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘కా డికాయ్ఫె స్కార్ఫ్ 90’ స్కార్ఫ్‌ను స్వచ్ఛమైన పట్టుతో నేస్తారు. హ్యాండ్ స్క్రీనింగ్ పద్ధతిలో వన్నెలద్దారు. రంగురంగుల్లో చిత్రమైన బొమ్మలతో ఈ స్కార్ఫ్ మెడలో అమరిపోతుంది. నచ్చినట్టు తలకు కట్టుకునేందుకు, ముచ్చటగా హ్యాండ్ బ్యాగ్‌కు ముడేసేందుకు ఉపయోగించుకోవచ్చు. hermes.com లో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ.43 వేలు.
ఆప్లిక్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అమ్మాయిలకే సొంతం అనుకుంటాం. కానీ, ముచ్చటగా చేస్తే అబ్బాయిల దుస్తుల మీదా అందంగా కనిపిస్తాయంటారు డిజైనర్ జతిన్ మాలిక్. ఇటీవల బంగారు, నీలం వన్నెల్లో పొద్దుతిరుగుడు పువ్వు డిజైన్‌ను ప్రతిబింబిస్తూ.. ఈ రెండు వర్క్‌ల కలబోతగా ఈయన రూపొందించిన బ్లేజర్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రత్యేక సందర్భాల్లో ధరించేందుకు అబ్బాయిలూ ఇలాంటి చేతి పనితనం ఉన్న దుస్తుల్ని ఎంచుకోవచ్చు అనిపించేలా కనిపిస్తుంది. jatinmaliccouture.comలో అమ్ముతున్నారు. ధర రూ.72,500.
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”