న్యూఢిల్లీ : గత కొద్దినెలలుగా టెక్ ప్రపంచాన్ని వణికిస్తున్న మాస్ లేఆఫ్స్ (layoffs) చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో మరింత పెచ్చరిల్లుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఫన్, గేమ్స్ వంటి రంగాల్లో వినూత్న పోకడలకు తెరలేపడంతో పాటు టెక్ రంగం సహా పలు రంగాల్లో కొలువుల కోతకు తెగబడవచ్చనే సంకేతాలు వెల్లడవుతున్నాయి.
1,23,882 మందిపై వేటు
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్‌ను ట్రాక్ చేసే వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వివరాల ప్రకారం 2023లో ఇప్పటివరకూ 454 కంపెనీలు 1,23,882 మంది ఉద్యోగులను తొలగించాయని వెల్లడైంది. వ్యయాల్లో కోత, అనిశ్చిత వాతావరణంతో పాటు చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ వినియోగం పెరగడంతో కంపెనీలు లేఆఫ్స్‌కు మొగ్గుచూపుతున్నాయని తెలిసింది. రాబోయే రోజుల్లో ఏఐ ఉపాధి రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌తో కొలువుల కోతకు తెగబడుతుండగా టెకీల్లో గుబులు రేగుతోంది. ఆర్ధిక మాంద్య భయాలతో ఐటీ సహా పలు రంగాల ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై కలత చెందుతున్నారు. లింక్డిన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు లేఆఫ్స్ స్టోరీలతో నిండిపోతుండగా ఏ క్షణాన ఎవరి జాబ్ ఊడుతుందో అనే అనిశ్చిత వాతావరణం నెలకొంది.
జాబ్ మార్కెట్లో అనిశ్చితి
ఉపాధి రంగంలో ఏఐ విధ్వంసంపై ఆందోళన రేగుతుంటే మరోవైపు జాబ్ మార్కెట్లో అనిశ్చితి పరిస్ధితి, లేఆఫ్స్ ట్రెండ్‌పై మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మూడు రకాల ఉద్యోగులకు లేఆఫ్స్ ముప్పుందని, మరో రెండు రకాల ఉద్యోగులు సేఫ్‌గా ఉన్నారని క్రిస్ చెప్పుకొచ్చారు. లేఆఫ్స్ కొనసాగే క్రమంలో ఈవెంట్ ప్లానింగ్ టీం, న్యూ ఇనిషియేటివ్స్ టీం, కాంట్రాక్టు ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయే ముప్పు ఉందని స్పష్టం చేశారు.
సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపైనే కంపెనీలు వేటు వేస్తాయని దీంతో వారు అత్యధిక రిస్క్ గ్రూపులో ఉంటారని చెప్పారు. ఇక ఈవెంట్ ప్లానింగ్ ఆ తరహా ఉద్యోగాలు కూడా సంక్షోభ సమయంలో ముప్పును ఎదుర్కొంటాయని కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తాయని తెలిపారు.
ఇక కంపెనీ లాభాలను నేరుగా ప్రభావితం చేసే ఉద్యోగులు సేఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కంపెనీ లాభాలకు సన్నిహిత సంబంధం ఉన్న రంగాల్లోని ఉద్యోగులకు లేఆఫ్స్ ముప్పు తక్కువని క్రిస్ చెప్పారు. మరోవైపు హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లేఆఫ్స్ ముప్పు ఉండదని పేర్కొన్నారు.
Read More :
Flipkart | 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్..ప్రీమియం ఫోన్లపై హాట్ డీల్స్..!
Telegram | టెలిగ్రామ్ అడ్డాగా సైబర్ దోపిడీ.. నెలకు రూ.10 కోట్లకు పైగా మోసం