Instagram Threads | సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో అధునాతన ఫీచర్లు వచ్చి చేరుతున్నాయి. వినియోగదారులను కట్టిపడేయడానికి సామాజిక మాధ్యమాలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నాయి ఆయా సంస్థలు. థ్రెడ్స్ కాన్సెప్ట్ అలా డిజైన్ చేసిందే! ట్విట్టర్(ఎక్స్)ను బలంగా ఢీ కొట్టడానికి ఇన్స్టాగ్రామ్ అందుకున్న శస్త్రం థ్రెడ్స్. కస్టమర్‌కు విశేషమైన సేవలు అందించే లక్ష్యంతో సిద్ధమైన థ్రెడ్స్ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లో సంచలనం సృష్టిస్తున్నది.
ఈ తరం బయటి ప్రపంచంతో కన్నా ఆన్లైన్ వరల్డ్తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నది. ఆలోచనలు, ఆనందాలు, భావోద్వేగాలు, సందేశాలు, వార్తలు ఇలా అన్నిటినీ షేర్ చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలే సరైన వేదికగా భావిస్తున్నాయి. కాలక్షేపానికి కొందరు, అదే కాలక్షేపంగా మరికొందరు సోషల్ మీడియాలో బతికేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విట్టర్లు అభిప్రాయాలు పంచుకునే వేదికలుగా నిలిచాయి. ఇన్స్టాగ్రామ్ అంతకుమించిన థ్రిల్ పంచుతున్నది. ఫొటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ వారివారి టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. రక్షణతోపాటు విలక్షణ ఆప్షన్స్ కలగలసిన థ్రెడ్స్ ఇన్‌స్టాలో సబ్మాడ్యుల్లా వచ్చి చేరడంతో యూజర్లకు కొత్త కిక్ లభించినట్టయింది. థ్రెడ్స్ లాంచ్ అయిన మొదటి రెండు గంటల్లోనే 20 లక్షల మందిని ఆకట్టుకుంది. మొదటి నాలుగు గంటల్లో 50 లక్షలమంది సైన్ ఇన్ అయ్యారంటే థ్రెడ్స్ ఎంతలా పట్టు బిగిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు

దగ్గరి నేస్తాలు: ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం థ్రెడ్స్ కల్పిస్తుంది. దగ్గరి నేస్తాలతో ఒక కమ్యూనికేషన్ ఏర్పర్చుకోవచ్చు.
స్టేటస్ అప్డేట్: మీ స్టేటస్ కేవలం మీ సన్నిహితులు మాత్రమే చూసేలా చేసుకోవచ్చు.
కెమెరా కన్ను: థ్రెడ్స్‌లో కెమెరా సెంట్రిక్ ఇంటర్ఫేస్ కొత్త అనుభూతిని ఇస్తుంది. లైవ్ చిత్రాలు, వీడియోలు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు.
ఆటోమెటిక్ షేరింగ్: వినియోగదారులు తాము ఎంచుకున్న స్నేహితులతో మీరు అనుకున్న సమాచారాన్ని, వీడియోలు, ఫొటోలను ఆటోమెటిక్‌గా షేర్ చేసుకునే వెసులుబాటు థ్రెడ్స్ కల్పిస్తుంది.
స్టోరీస్ ఇంటిగ్రేషన్: యూజర్లు.. తమ స్నేహితులు పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలను యాక్సెస్ చేసే అవకాశం ఉంది.
నిర్ణయం మీదే: మనం పంపిన సందేశం ఎవరికి చేరాలో, ఎవరెవరు పంపే సందేశాలు మనకు చేరాలో నిర్ణయించుకునే అధికారం థ్రెడ్స్ ద్వారా యూజర్లకు దక్కింది. మీరు ఎంచుకున్న ఆప్షన్స్ ఆధారంగా సందేశాలు చేరుతాయి.
పరిమితులు: సంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లా కాకుండా, థ్రెడ్స్ ద్వారా ఓపెన్-ఎండ్ బ్రౌజింగ్ ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా పబ్లిక్ కంటెంట్‌ను నిరోధించుకునే వెసులుబాటు
కలుగుతుంది.

☞ ట్విట్టర్లో గరిష్ఠంగా 280 అక్షరాలను పోస్ట్ చేయొచ్చు. థ్రెడ్స్‌లో ఈ పరిమితి 500 అక్షరాలు. ఇది పూర్తిస్థాయి సందేశాన్ని పంపడానికి దోహదం చేస్తుంది.
☞ ట్విట్టర్లో వ్యక్తిగత ట్వీట్‌ను ఎవరైనా లైక్ చేయొచ్చు, రీ ట్వీట్ చేయొచ్చు, రిైప్లె కూడా ఇవ్వొచ్చు. థ్రెడ్స్‌లో రిైప్లె, రీట్వీట్ ఎవరు చేయాలో కూడా నిర్దేశించుకునే వెసులుబాటు ఉంది.
☞ ట్వీట్లు వేగంగా వైరల్ అవుతాయి. అదే సమయంలో థ్రెడ్స్ కాస్త నెమ్మదిగా వ్యాపిస్తాయి. అటెన్షన్ స్పాన్, అక్షర పరిమాణం, ట్వీట్
ప్రమోషన్ ట్విట్టర్లోనే సమర్థంగా కనిపిస్తాయి.
☞ ఇప్పటివరకైతే థ్రెడ్స్‌పై జరిగిన సైబర్‌దాడుల గురించి అధికారిక నివేదికలు అయితే ఏమీ లేవు! కానీ, థ్రెడ్స్‌లో రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి.
☞ థ్రెడ్స్ ప్రొఫైల్ ఎవరు చూడాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్ ఓపెన్ చేసి ప్రైవేట్ ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. పబ్లిక్ టు ప్రైవేట్, ప్రైవేట్ టు పబ్లిక్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
☞ రిపోర్ట్స్‌ను హైడ్గానీ, అవసరంలేని ఖాతాను మ్యూట్ గానీ చేసుకోవచ్చు. ఇందుకోసం మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ సెలెక్ట్, మ్యూట్, రిపోర్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. కోరుకున్నది ఎనేబుల్ చేస్తే చాలు.
☞ అభ్యంతరకర వాక్యాలు ఉన్న పోస్టులు రాకుండా నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. హిడెన్ వర్డ్స్ జాబితాలో మీరు కొన్ని పదాలను ఎంచుకోవచ్చు. ఆయా పదాలున్న కంటెంట్‌కు సంబంధించి మీకు ఎలాంటి నోటిఫికేషన్లు రావు.
☞ థ్రెడ్స్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తే.. సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌లోకి వెళ్లాలి. అందులో టేక్ ఏ బ్రేక్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీరు కోరుకున్నన్ని రోజులు థ్రెడ్స్‌కు దూరంగా ఉండొచ్చు.
☞ సెట్టింగ్స్‌లో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్ఏ) ఎనేబుల్ చేయడం ద్వారా భద్రత పెరుగుతుంది.
☞ కఠినమైన పాస్వర్డ్ ఎంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయమని గుర్తుంచుకోండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”
“Threads | మూడు వారాల్లో ‘థ్రెడ్స్’ పాపులారిటీ ఓవర్.. మెటా` క్లారిటీ మిస్సయిందా..”