గూగుల్ ( Google ) అత్యంత శక్తిమంతమైన సాంకేతిక వ్యవస్థ. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటి. ప్రతీ విషయాన్నీ గూగుల్‌లో తెలుసుకోవచ్చు. లేచిన దగ్గర్నుంచి పడుకునేవరకూ ప్రతి ఒక్కరికీ ఫోన్, గ్యాడ్జెట్స్, పీసీల రూపంలో గూగుల్ అవసరం ఉండనే ఉంటుంది. అందుకే మనం గూగుల్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొంప కొల్లేరే.
గూగుల్ ఆధారిత యాప్స్ ద్వారా మనం ఏ పని చేసినా ‘మై యాక్టివిటీ’లో సేవ్ అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ దొంగలకు చిక్కకుండా https://myactivity.google.com ద్వారా ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి. మరీ అవసరమైనవి సేవ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మీరు ఆన్ చేసే లొకేషన్ ఆధారంగా మీ ప్రయాణాన్ని గూగుల్ ట్రాక్ చేస్తుంది. ఆ మేరకు మీకు నెలవారీ రిపోర్టు అందిస్తుంది. చాలామంది ఎక్కువగా యూట్యూబ్ చూస్తుంటారు. మీరు ఏ వీడియో కోసం వెతికారు? ఆ వీడియోను ఎంతశాతం చూశారు? ఎక్కడ ఆపేశారు? మళ్లీ ఎప్పుడు చూశారు?.. తదితర విషయాలు ఇక్కడ సేవ్ అవుతాయి. అలాగే గూగుల్ ద్వారా మీరు యాక్సెస్ చేసిన థర్డ్‌పార్టీ యాప్స్ సైతం ఇక్కడ నమోదు అవుతాయి. వాటి ద్వారా మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. మీ ప్రమేయం లేకుండా లాగిన్ అయితే.. వెంటనే సైన్ అవుట్ కావచ్చు. యాప్‌లను డిలీట్ చేయవచ్చు. మీ డౌన్లోడ్ డేటా, సెర్చింగ్ డేటా కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ వివరాలనూ డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ ద్వారా జరిపిన ఆన్లైన్ చెల్లింపులు, రిజర్వేషన్, సభ్యత్వాలు.. ఇతర విషయాలన్నీ సేవ్ అవుతాయి. కాబట్టి ‘మై యాక్టివిటీ’ అనేది అతి ముఖ్యమైంది. దీనిపై మీకు కచ్చితమై అవగాహన అవసరం.
అనంతమైన గూగుల్ ప్రపంచంలో మీరు క్షేమంగా బతికేందుకు ‘https://myaccount. google.com/ security’ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్ ఫీచర్స్ మార్చుకోవచ్చు. అపరిచితుల లాగిన్ నివారించొచ్చు. ఎవరైనా మీ మెయిల్లో లాగిన్ అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరా? కాదా? అనేది నిర్ధారించుకోవచ్చు. కొత్త సైన్ ఇన్, తాజాగా కార్యకలాపాలను తనిఖీ చేసుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు. మీకు నచ్చని మెయిల్స్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. వాటిని స్పామ్ ఫోల్డర్‌కు తరలించొచ్చు. మీకు అవసరమైన కుకీలను సేవ్ చేసుకొని, మిగిలినవాటిని తొలగించవచ్చు. వీటితోపాటు మరెన్నో ఉపయోగాలను అందిస్తుంది గూగుల్ సెక్యూరిటీ. మీ కంటెంట్, సెర్చింగ్ వంటి ఇతర విషయాలు గూగుల్‌లో సేవ్ కాకుండా ఉండాలంటే Cookie Autodelete , uBlock Origin, Badger, Invid Verification Plugin వంటి బ్రౌజర్లు ఉపయోగించండి. మీరు నెట్లో ఏం సెర్చ్ చేయాలనుకున్నా.. http ఉందా? https? ఉందా అని తెలుసుకోండి. http ఉంటే అది ఫేక్ వెబ్సైట్. https అని ఉంటేనే సురక్షితమని అర్థం.
మీరు గూగుల్‌లో వెతికిన విషయాలతో ముడిపడిన యాడ్స్ నిత్యం మీ ఫోన్లో డిస్ప్లే అవుతూ చికాకు కలిగిస్తాయి. అలాంటప్పుడు Badger బ్రౌజర్ మీకు ఉపయోగపడుతుంది. ఒక్కోసారి కోట్స్ ( ), (-), (:) వంటివి ఉపయోగించి సెర్చ్ చెసే అవకాశం ఉంది. ఉదాహరణకు మీకు మారుతి టెంపుల్ గురించి వివరాలు కావాలని ‘మారుతి’ అని టైప్ చేస్తే.. మారుతి సుజుకికి చెందిన కార్లు, వివరాలు వస్తాయి. అందుకే హైఫన్ వంటివి ఉపయోగించి ‘మారుతి – టెంపుల్ లేదా మారుతి టెంపుల్’ అని సెర్చ్ చేస్తే మీరు కోరుకున్న వివరాలు మాత్రమే వస్తాయి. మీరు ఎండ్ నౌ ఫౌండేషన్ వంటి వాటి గురించి వెతకాలనుకుంటే related:endnowfoundation.org అని టైప్ చెయ్యాలి.
> జీమెయిల్, సోషల్ మీడియా, ఇతర బ్యాంకింగ్ యాప్స్ వాడటానికి టూ స్టెప్ వెరిఫికేషన్లను యాక్టివేట్ చేసుకోండి.
> తరచూ గూగుల్ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోండి. మీకు తెలియని లాగిన్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఉంటే కచ్చితంగా డిలీట్ చెయ్యండి.
> మీరు ఉపయోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సరైన లైసెన్స్ కలిగిన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను వేసుకోండి. వాటిని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోండి.
> పబ్లిక్ Wi-Fi నుంచి బ్యాంకింగ్, ఇతర సున్నితమైన వెబ్సైట్లను యాక్సెస్ చేయవద్దు.
> మీకు మెసేజ్, వాట్సాప్ రూపంలో వచ్చే బ్లూకలర్ లింక్స్ ఓపెన్ చెయ్యకండి. ఒకవేళ వాటిని తనిఖీ చేయాలనుకుంటే https://www.isitphishing.org లేదా https://www.urlvoid.com వంటి సైట్లను ఉపయోగించవచ్చు.
> గూగుల్ క్రోమ్‌లోని ఇన్‌కాగ్నిటో, టీఓఆర్, బ్రేవ్, డక్‌డక్ గో వంటి ప్రైవసీ బ్రౌజర్లు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే తప్పనిసరిగా లాగాఫ్ చెయ్యండి.
> పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రత్యేకమైన అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైన క్లిష్టమైన పదాలు, అంకెలు ఎంచుకోండి.
> ..ముఖ్యంగా కాల్స్‌లో ఉన్నప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దు. ఎవరి నుంచి అయినా డబ్బు స్వీకరించడానికి మీరు OTP ఇవ్వాల్సిన పన్లేదు. QR కోడ్‌ని స్కాన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.
అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త