హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతి ఫైలుకూ ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. ఎదుటి వారి అవసరమే తమ పెట్టుబడిగా కొంత మంది అధికారులు రెచ్చిపోతున్నారు. వైద్యశాఖపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. తమకేం పట్టదన్నట్టు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. అలా తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో నిబంధనలకూ తూట్లు పొడుస్తూ ఇచ్చిన డిప్యుటేషన్లు తీవ్ర చర్చనీయాశంగా మారాయి. నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక జీవో ద్వారా డిప్యుటేషన్లు ఇస్తారు. కానీ, టీవీవీపీలో 2024 మార్చి 15న ప్రభుత్వ మెమో పేరిట ఒకే ఉత్తర్వులో 20 మంది డాక్టర్లకు డిప్యుటేషన్లు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ అనుమతితో కాకుండా సెక్షన్ ఆఫీసర్ సంతకంతో ఈ వ్యవహారం నడిపినట్టు తెలిసింది. ఇందుకు గానూ ఒక్కో వైద్యుడి నుంచి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు శాఖ కీలక అధికారితోపాటు ఆయనకు నమ్మిన బంటులా పనులు చక్కబెట్టే మరో కింది స్థాయి అధికారి నడిపినట్టు సమాచారం.
టీవీవీపీలో మెమో ద్వారా ఒకేసారి 20 మంది వైద్యులకు డిప్యుటేషన్లు ఇవ్వడంపై ఇతర వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘనేనని మండిపడుతున్నారు. ఆ 20 మంది వైద్యుల డిప్యుటేషన్ గడువు నిరుడు మార్చి 25తో ముగిసింది. దీంతో వారి స్థానంలో అదే నెల 26న డిప్యుటేషన్లపై వచ్చిన 20 మంది వైద్యులను రిలీవ్ చేయొద్దంటూ ఆ శాఖ కీలక అధికారి జిల్లా అధికారులకు లేఖ పంపారు. దీనిపై కూడా సెక్షన్ ఆఫీసర్ సంతకం చేయడం గమనార్హం. ఎక్స్టెన్షన్ కోరుతూ తాము ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే వారికి ఏడాది గడువు పెంచినట్టు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇతర వైద్యులు ఆరోపిస్తున్నారు. డిప్యుటేషన్‌పై వచ్చిన 20 మంది గత మూడేండ్ల నుంచి అక్కడే పాతుకుపోతే తమ పరిస్థితి ఏమికావాలని మండిపడుతున్నారు. ఆ డిప్యుటేషన్లు ప్రభుత్వం ఇచ్చిందా? లేక కలెక్టర్ ఇచ్చారా? అని ప్రశ్నిస్తే.. ఓరల్ డిప్యుటేషన్లు అని ఉన్నతాధికారులు బదులివ్వడం గమనార్హం. దీంతో అవతవకలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఇతర వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.