ఆదివారం 24 జనవరి 2021
Sangareddy - Nov 29, 2020 , 00:13:45

పోలింగ్‌ నిబంధనలివే...

పోలింగ్‌ నిబంధనలివే...

 • పోలింగ్‌ బూత్‌కు 100మీటర్లలోపు ప్రచారం నిషేధం
 • పోలింగ్‌ రోజున అభ్యర్థి వాహనానికి మాత్రమే అనుమతి
 • ఫోన్లకూ అనుమతి లేదు 
 • పోలింగ్‌ నిబంధనలు విడుదల

పటాన్‌చెరు/రామచంద్రాపురం : పోలింగ్‌కు సంబంధించి ఏజెంట్ల నియామకం, అభ్యర్థులు,పార్టీలు అనుసరించాల్సిన నియమనిబంధనలను శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికలఅథారిటీ, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ విడుదలచేశారు. అభ్యర్థులు, పార్టీలు ఈ నిబంధనలు తూచా తప్పకుండాపాటించాలని ఆయన స్పష్టంచేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...

పోలింగ్‌, కౌంటింగ్‌ ఏజెంట్లుగా అనుమతిలేనివారు....

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటుసభ్యులు, రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీమేయర్లు, మున్సిపాలిటీచైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లు, ఏదేని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సి పాలిటీల సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్లు, మండల ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్లు, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, గ్రామ పంచాయితీల సర్పంచులు, మండల ప్రజాపరిషత్‌ల సభ్యులు, ఎన్నిక కాబడిన జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంస్థల చైర్‌పర్సన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్‌పర్సన్లు, ప్రభుత్వ సంస్థల చైర్‌పర్సన్లు, ప్రభుత్వ న్యాయవాదులు, అదనపు ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు.

8 మంది ఏఆర్వోల నియామకం 

- ఉత్తర్వులు జారీచేసిన ఎన్నికల సంఘం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రెండు హాళ్లలో కౌంటింగ్‌ నిర్వహించే కేంద్రాల్లో అదనపు రిటర్నింగ్‌ అధికారుల (ఏఆర్‌వో)ను నియమించారు. మల్కాజిగిరి, బేగంపేట సర్కిళ్లలోని 8 వార్డులకు ఏఆర్‌వోలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. నేరేడ్‌మెట్‌, వినాయకనగర్‌, మౌలాలి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి, గౌతమ్‌నగర్‌, రాంగోపాల్‌పేట్‌, మెండామార్కెట్‌ వార్డుల ఓట్ల లెక్కింపులో ఈ అధికారులు పాల్గొననున్నారు.

పోలింగ్‌ రోజు...

 • పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 200మీటర్ల పరిథిదాటి వెలుపల ఎన్నికల బూతు ఏర్పాటు చేయవచ్చు. ఒక టేబుల్‌, రెండు కుర్చీలు, ఇద్దరు వ్యక్తులకు సరిపోయే రక్షణకై ఒక గొడుగు, లేక ఒక టార్పాలిన్‌ ఉపయోగించవచ్చును. అభ్యర్థి పేరు, పార్టీపేరు, ఎన్నికల చిహ్నము కలిగి ఉండే ఒక బ్యానర్‌(మూడు అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పు)ను ఏర్పాటు చేసుకోవచ్చును.
 • ఇటువంటి బూత్‌లను ఏర్పాటు చేసే ముందు స్థానిక అధికారుల నుంచి లిఖిత పూర్వక అనుమతిని పొందడం అవసరం. బూత్‌లు నిర్వహిస్తున్న వ్యక్తులు అనుమతి పత్రాలను పోలీసు, ఎన్నికల అధికారులు అడిగిన వెంటనే చూపించాల్సి ఉంటుంది.
 • పోలింగ్‌ జరిగే రోజున పోలింగ్‌ బూత్‌కు వంద మీటర్ల పరిథిలోపల ఎన్నికల ప్రచారం చేయరాదు.
 • పోలింగ్‌ స్టేషన్‌ లోపల, పోలింగ్‌ స్టేషన్‌కు 100మీటర్ల పరిథిలోపల మొబైల్‌ ఫోన్లు, కార్డ్‌లెస్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్లు మొదలైనవాటిని కలిగి ఉండుట, ఉపయోగించుట నిషేధం. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్‌ అధికారి, రిటర్నింగ్‌ అధికారి, భద్రతా సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ కలిగి ఉండడానికి అనుమతి ఉంటుంది. అయితే వారు ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో ఉంచాలి.
 • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతి వార్డు అభ్యర్థికి పోలింగ్‌ రోజున ఒక వాహనాన్ని ఆ వార్డు పరిధిలో తిరగడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అతని ఏజెంట్‌, కార్యకర్తలు, ఇతర రాజకీయ నాయకులకు వేరే వాహనాన్ని అనుమతించబడదు.
 • ఒక అభ్యర్థి పేరుతో కేటాయించిన వాహనం, ఏ ఇతర అభ్యర్థి ఉపయోగించడానికి అనుమతి ఉండదు.
 • పోలింగ్‌ రోజున ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌ నుంచి ఏదైనా వాహనం ద్వారా తీసుకొని వెళ్లడం నేరంగా పరిగణిస్తారు. 


logo