ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Aug 02, 2020 , 00:12:16

కల్లాల నిర్మాణంతో కష్టాలు దూరం

కల్లాల నిర్మాణంతో కష్టాలు దూరం

వట్‌పల్లి : రైతులు పొలంలో విత్తనాలు వేసింది మొదలు.. పంటలు చేతికొచ్చి మద్దతు ధర చెల్లించేవరకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం, వారి పంట నూర్పిళ్లకు సైతం ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా రైతుల పొలాల్లో కల్లాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంతకాలం రైతులు పండించిన పంటలను నూర్పిళ్లు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇకపై వారి ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వం ఓసీ, బీసీలకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100శాతం సబ్సిడీతో కల్లాలను నిర్మి స్తుండగా, రాయికోడ్‌, జోగిపేట వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని మండలాల నుంచి రైతులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో అధికారులు మార్కింగ్‌ ఇవ్వడంతో పనులు సైతం చకచకా సాగుతున్నాయి. రాయికోడ్‌ డివిజన్‌ పరిధిలో 632, జోగిపేట డివిజన్‌ పరిధిలో 560 దరఖాస్తులు రాగా, వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పొల్లాల వద్దకు వెళ్లి కల్లాల నిర్మాణానికి మార్కింగ్‌వేసి పనులు ప్రారంభించారు. మెజార్టీ గ్రామాల్లో రైతులు కల్లాల నిర్మాణాలు చేపడుతుండగా, కొన్ని గ్రామాల్లో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. 50, 60,75 చదరపు మీటర్లలో కల్లాలను నిర్మించనుండగా, 50 మీటర్ల కల్లానికి రూ.56,187వేలు, 60 మీటర్లకు రూ. 68 వేలు, 75 మీటర్లకు రూ.85వేలు కల్లాలు నిర్మించుకున్న రైతులకు చెల్లించనున్నారు. ఇంతకాలం పంటల కల్లాలు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కష్టపడి పండించిన పంటలను అష్టకష్టాలు పడుతూ రోడ్లపైకి తీసుకువచ్చి నూర్పిళ్లు చేసుకునేవారు. దీంతో రోడ్లపై నుంచి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడడం...రైతులు ప్రమాదాల బారిన పడడం జరిగేది. కొన్ని సందర్భాల్లో రైతులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వీటనింటిని గుర్తించిన ప్రభుత్వం రైతులు ఎవరి పొల్లాల వద్ద కల్లాలు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


logo