ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 28, 2020 , 22:58:10

కరోనా నేపథ్యంలో ఆర్టీఏ సేవలు

కరోనా నేపథ్యంలో ఆర్టీఏ సేవలు

  • n ప్రస్తుతం అందుబాటులో ఐదు రకాల కార్యకలాపాలు
  • n రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి..
  • n డూప్లికేట్‌ లర్నింగ్‌, డ్రైవింగ్‌, బ్యాడ్జీ నెంబర్‌ లైసెన్స్‌లు
  • n లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ కూడా అందుబాటులో...
  • n యథావిధిగా కొనసాగుతున్న ఆర్టీఏ పనులు
  • n రోజువారీగా  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 800 ఫైళ్లు క్లియర్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలను మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో డూప్లికేట్‌ లర్నింగ్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జీ నెంబర్‌, స్మార్ట్‌కార్డు జారీ, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌.. ఇలా మరో ఐదు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలు ఆ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ సేవలతో పాటు మరోవైపు ఆర్టీఏ కార్యాలయాల్లో అన్నిరకాల సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, సిద్దిపేట, మెదక్‌ ఆర్టీఏ కార్యాలయాల్లో రోజువారీగా 800 వరకు ఫైళ్లను అధికారులు క్లియర్‌ చేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీతో పాటు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర పనులు కొనసాగుతున్నాయని ఉమ్మడి మెదక్‌ జిల్లా రవాణా శాఖ అధికారి శివలింగయ్య ‘ నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 

ఐదు రకాల సేవలు అందుబాటులో..

రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొదటగా ఐదు రకాల సేవలను అందిస్తున్నారు. ఇందులో డూప్లికేట్‌ లర్నింగ్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జీ నెంబర్‌, స్మార్ట్‌ కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ జారీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లర్నింగ్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఫీజు చెల్లిస్తే ఇంటికి లైసెన్స్‌ పోస్టులో పంపిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘టీ ఆఫ్‌ ఫోలియే’ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ యాప్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్పు(లైసెన్స్‌ హిస్టరీ షీట్‌) సేవలను అందిస్తున్నారు. చిప్‌ లేని పాతకార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డు కావాలనుకునే వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే స్మార్ట్‌కార్డు నేరుగా ఇంటికి వస్తుంది. ప్రస్తుతానికి ఐదు రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా రవాణా శాఖ అందిస్తున్నదని, త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ సేవలను చాలామంది వినియోగించుకుంటున్నారు. 

యథావిధిగా కొనసాగుతున్న ఆర్టీఏ సేవలు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మాస్క్‌ ఉన్నవారినే కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. కార్యాలయ ప్రధాన గేట్ల వద్దనే శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. భౌతిక దూరం పాటించేలా దూరదూరంగా కుర్చిలు వేశారు. లర్నింగ్‌, డ్రైవింగ్‌ లెసెన్స్‌లతో పాటు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో 140, జహీరాబాద్‌లో 80, పటాన్‌చెరు 150, సిద్దిపేట కార్యాలయంలో 270, మెదక్‌ ఆర్టీఏ కార్యాలయంలో 150 వరకు ఫైళ్లు రోజువారీగా క్లియర్‌ చేస్తున్నారు. ఇందులో కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌లతో పాటు లర్నింగ్‌, వాహన రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో కార్యాలయాల్లో సిబ్బంది కొంత వరకు భయాందోళనకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ, అన్నిరకాల సేవలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.

ఆన్‌లైన్‌ సేవలను  వినియోగించుకోవాలి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు కార్యాలయాల వద్దకు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలి. ‘T App Folio’ యాప్‌లో సేవలను చూసుకోవచ్చు. చిప్‌తో కూడిన స్మార్ట్‌ కూడా నేరుగా ఇంటికే పంపిస్తున్నాం. యాప్‌లోకి వెళ్లి వివరాలు పొందుపరిచి, తగిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇంట్లో నుంచే నేరుగా ఆర్టీఏ సేవలను పొందవచ్చు. లర్నింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగుట్టుకున్న వారు, బ్యాడ్జీ నెంబర్‌, స్మార్టు కార్డు కావాల్సినా, అలాగే లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ సేవలు పొందవచ్చు. 

- శివలింగయ్య, ఉమ్మడి మెదక్‌ జిల్లా రవాణా శాఖ అధికారి


logo