రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. దీంతో రిటర్నింగ్ అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. జిల్లాలోని 126 వార్డులకు 453 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వారిలో ఆయా పార్టీలకు చెందిన వారు ఉన్నారు. అనేక నాటకీయ పరిణామాలు, బుజ్జగింపుల తర్వాత రెబల్స్ కొందరు పోటీ నుంచి తప్పుకొన్నా కాంగ్రెస్‌లో తిరుగుబాటు బెడద మాత్రం తగ్గలేదు. కొంద రు బీఫారాలు దక్కకపోవడంతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఇబ్రహీంపట్నంలోని 13 వార్డులో కాం గ్రెస్ బీఫారం రాకపోవడంతో సోహెల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అలాగే, ఆరోవార్డు నుంచి రవీందర్ కాంగ్రెస్ టికెట్ ఆశించగా దక్కకపోవటంతో ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, ఆమనగల్లు, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లోనూ పలువురు ఆశావహులకు బీఫారాలు రాకపోవడంతో కాంగ్రెస్‌పై అలక పూనారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా పలువురు కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారు పోటీ నుంచి తప్పుకొనేందుకు ససేమిరా అన్నారు. వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇబ్రహీంపట్నం ఆరోవార్డులో కాంగ్రెస్ నుంచి జిలమోని రవీందర్, మహ్మద్గౌస్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇరువురు బీఫారం కోసం చివరి వరకు పోటీపడగా.. గౌస్కే పార్టీ బీఫారం దక్కడంతో రవీందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. 13వ వార్డు నుంచి నామినేషన్ వేసిన సోహెల్‌కు బీఫారం దక్కకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, 16వ వార్డులో కాంగ్రెస్ రెబెల్స్ అభ్యర్థి సుష్మాకర్ణాకర్రెడ్డి కూడా బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు బీజేపీ అభ్యర్థి ఎం పిక విషయంలో నెలకొన్న పంచాయితీ చివరకు రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు చేరింది. ఈ వార్డు నుంచి రవీందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి పోటీ పడగా.. అధిష్ఠానం శశిధర్‌రెడ్డికి బీఫారాన్ని అందజేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్‌రెడ్డి వర్గం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని రవీందర్‌రెడ్డికి బీఫారాన్ని ఇచ్చారు.
పలు మున్సిపాలిటీల్లో పార్టీ టికెట్లు దక్కని ఆశావహులంతా ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. జిల్లాలోని 126 మున్సిపాలిటీల్లో 22 మందికిపైగా ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. వీరు తమ గెలుపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని ఆయా పార్టీల అభ్యర్థులు భయపడుతున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ము గిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల తరఫున ఇద్దరు, ముగ్గురు వేసిన నామినేషన్లను వెనక్కి తీసుకునేలా నాయకులు చేసిన యత్నాలు ఫలించాయి. బీఆర్ఎస్కు రెబెల్స్ బెడద తక్కువగా ఉండగా.. నామినేషన్లు దాఖలు చేసిన ఆశావహులను మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని వారితో విత్‌డ్రా చేయించారు. వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వికారాబాద్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు ప్రలోభపెట్టి విత్‌డ్రా చేయించారన్న ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా 15వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థిని విత్‌డ్రా చేసుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవ ఎన్నికయ్యింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థినిని కాంగ్రెస్ నాయకులు బెదిరించి ఆ పార్టీలో చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 100 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, 98 వార్డుల్లో 341 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తాం డూరు మున్సిపాలిటీలో ఉన్నారు. వికారాబాద్ ము న్సిపాలిటీలో ఒకటి, 15వ వార్డులు ఏకగ్రీవం కాగా.. మరో 32 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా 112 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు 135 మంది, పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులకు 60 మంది, కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 34 మంది అభ్యర్థులు పోటీప డుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 198 నామినేషన్లను ఉపసంహరించుకోగా.. వికారాబాద్ మున్సిపాలిటీలో 67 నామినేషన్లు, తాండూరు మున్సిపాలిటీలో 48, పరిగి మున్సిపాలిటీలో 45, కొడంగల్ మున్సిపాలిటీలో 38 నామినేషన్లను పార్టీల అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయం త్రం 5 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రచారానికి ఇంకా 6 రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్.. మరింత దూకుడును పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా విజయకేతనం ఎగురవేయగా .. మున్సిపల్ ఎన్నికల్లోనూ నాలుగు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా వ్యూహంతో ముం దుకు సాగుతున్నది. ఇప్పటికే మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, నరేందర్రెడ్డిలతోపాటు ఆయా మున్సిపాలిటీల ఇన్చార్జిలు మధుసూదనాచారి, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్, గట్టు రామచంద్రరావులు నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. గత కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని నాలుగు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించి ఓట్లు అడగనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు ఒక్క రూపాయీ నిధులివ్వకపోవడంతోపాటు ఆరు గ్యారెంటీలంటూ అన్ని వర్గాల ప్రజలకు చేసిన మోసాన్ని ఇంటింటికెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ఓటర్లకు వివరించనున్నారు.
