Wife Suicide | మల్కాజిగిరి, మార్చి 5 : భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం… వాణి నగర్‌కు చెందిన శ్రీరామ్ అనూష భాను ప్రైవేట్‌గా పని చేస్తున్నాడు. బేగంపేట్ శ్యామ్ లాల్‌కు చెందిన అప్పగల్లా సుగుణ కూతురు ఉషారాణితో 2022 మే 11న వివాహం జరిగింది. 2023 మే నెలలో శ్రీరామ్ అమెరికా వెళ్ళాడు. సెప్టెంబర్‌లో ఉషారాణి భర్త వద్దకు అమెరికా వెళ్ళింది. ఉషారాణి అమెరికా నుంచి 2024 ఏప్రిల్ 17న హైదరాబాద్ వచ్చింది. వాణి నగర్‌లోని అత్తామామ నిర్మల కోటేశ్వరరావుతో కలిసి ఉంటుంది.
సోమవారం రాత్రి పది గంటలకు ఉషారాణి డిన్నర్ చేసి బెడ్ రూమ్‌కు వెళ్ళింది. మంగళవారం ఉదయం కోడలు బయటకి రాకపోవడంతో అత్త నిర్మల బెడ్ రూమ్ డోర్‌ను తట్టింది. మధ్యాహ్నం వరకు కోడలు బయటకి రాకపోవడంతో మరోసారి డోర్‌ను తట్టింది. లోపలి నుంచి శబ్దం రాకపోవడంతో అత్తతో పాటు ఆమె సోదరుడు రమేష్ వాచ్‌మెన్‌తో కలిసి డోర్‌ను పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూసేసరికి ఉషారాణి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఉషారాణి తల్లి సుగుణకు అత్త ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మని చెప్పింది. తల్లి వచ్చి చూసేసరికి కూతురు ఉషారాణి మరణించింది. అమెరికాలో ఉన్న ఉషారాణి భర్త శ్రీరామ్ ఉద్యోగం నెలరోజుల క్రితం పోయింది. అప్పటి నుంచి వీడియో కాల్స్‌తో భర్త మానసికంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో ఉషారాణి రాసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.