కారేపల్లి, మార్చి 14 : సీతారామ ప్రాజెక్టులో భాగంగా 13వ ఫేస్ లో భూములు కోల్పోయిన రైతులకు చివరిసారిగా తమ పంటలను దిగుబడి చేసుకునే అవకాశాన్ని కల్పించి సహకరించాలని కోరారు. రేలకాయలపల్లి రెవెన్యూలో ఉన్న భూ నిర్వాసితులు శనివారం తమ సుబాబుల్ పంట దిగుబడిని చేసుకున్నారు. సీతారామ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు అక్కడికి చేరుకుని రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను ప్రాజెక్టు కాల్వ కోసం కోల్పోవడం ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ చివరిసారిగా అందులో ఉన్న పంటను దిగుబడి చేసుకుంటుంటే మాటిమాటికి అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఎక్కడ కూడా ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులే చివరిసారిగా తమ పంటలను దిగుబడి చేసుకున్నారని తెలిపారు. తమ విషయంలోనే అధికారులు అవలంబిస్తున్న తీరు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల జోలికి అధికారులు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాటి రమేశ్, వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి, పాటి వెంకటేశ్వర్లు, పాటి రాంబాబు, గుజ్జర్లపూడి సైదులు, మాచర్ల రమేశ్, పాటి రంగయ్య, ఎర్రిపోతు భద్రయ్య, షేర్ మల్లయ్య, పాటి రామయ్య, గుజ్జర్లపూడి రంగయ్య, నాగభూషణం, గుర్రం జగ్గయ్య, హుస్సేన్ పాల్గొన్నారు.