Dhurandhar 2 | హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ ద రివెంజ్ (ధురంధర్ 2)’ సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. బుక్‌మైషోలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి టికెట్ అమ్మకాలు ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ, టాలీవుడ్ టైర్-1 స్టార్ హీరో సినిమా తరహాలో బుకింగ్స్ ట్రెండ్ కనిపించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ స్థాయిలో విడుదల కానుంది. నగరంలో ఇప్పటికే ఆ సినిమాకు రిలీజ్ ఫీవర్ నెలకొన్నప్పటికీ, దానికి ముందు రోజు అంటే మార్చి 18న ప్లాన్ చేసిన ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలు కూడా భారీ స్పందనను సొంతం చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం నగరంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) లో ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో కూడా బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నగరంలోని మిగతా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రన్‌టైమ్ దాదాపు 3 గంటల 55 నిమిషాలు ఉండటం, అలాగే సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికెట్ రావడం సాధారణంగా ప్రేక్షకులను ఆలోచనలో పడేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ అంశాలు ఏవీ ‘ధురంధర్ 2’ క్రేజ్‌ను తగ్గించలేకపోయాయి. ప్రస్తుతం కనిపిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్‌ను చూస్తే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా కంటెంట్‌పై ఉన్న హైప్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రీమియర్ షోలకే ఈ స్థాయి స్పందన లభిస్తే, విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉండే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ బుకింగ్స్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో దూసుకెళ్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.