Raftaar | బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు మరియు సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారిగా జతకట్టబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘రఫ్తార్’ (Raftaar). ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టును రాజ్ కుమార్ రావు భార్య, నటి పత్రలేఖ తన సొంత నిర్మాణ సంస్థ ‘కాంపా ఫిల్మ్స్’పై అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సమర్పణలో నిర్మించబోతుంది. విద్యా వ్యవస్థలోని చీకటి కోణాలు, కార్పొరేట్ పోటీ, సక్సెస్ కోసం ఆరాటపడే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ముఖ్యంగా డబ్బు, అధికారం మనుషుల సంబంధాలను ఎలా మారుస్తాయనే అంశాన్ని దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ఈ థ్రిల్లర్లో చూపించబోతున్నారు.
ఇక నేషనల్ అవార్డు గ్రహీతలైన రాజ్ కుమార్ రావు, కీర్తి సురేష్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు అనూరాగ్ ఠాకూర్, తాన్యా మణిక్తలా మరియు రజత్ కపూర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ‘సెక్టార్ 36’తో మెప్పించిన ఆదిత్య నింబాల్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో కథనం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ భారీ చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.