ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పాటిస్తారా.. లేక పైరవీలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నదానిపై చర్చ జరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా మూడు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేసి.. అందులో మార్పులు, చేర్పులు చేసేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గ్రామ సభల నిర్వహణకు అధికారులు నిర్ణయించారు.
– రంగారెడ్డి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)
ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలను మాత్రమే ఎంపిక చేస్తామని ముందుగా ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతగా జరుగుతుందని చెప్పినప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతోనే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేశారు. సోమవారం పూర్తయిన జాబితాను సంబంధిత అధికారులకు అధికారులు అందించనున్నారు.
ఈ జాబితాను ఆయా గ్రామసభల్లో ప్రజల ముందుంచి ఇందులో అర్హులు ఉన్నారా, అనర్హులున్నారా అన్నదానిపై చర్చించనున్నారు. గ్రామ సభల ద్వారా చర్చించిన తర్వాత ఆ వివరాలను కలెక్టర్‌కు అందజేస్తారు. కలెక్టర్ స్థాయిలో పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. గ్రామ సభల తర్వాత తయారుచేసే అభ్యర్థుల జాబితాలో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ కమిటీలు కూడా జాబితాను తయారుచేసి సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేస్తున్నారు. దీంతో సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతాయా.. లేదా, రాజకీయ జోక్యంతో ఫైనల్ చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 3.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నగర శివారుల్లో జిల్లా విస్తరించి ఉన్నందున వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకుని నివాసముంటున్నవారు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఇండ్లు నిర్మించుకునేవారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద సుమారు రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించింది.
ఈ సమయంలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం 3.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాని, జిల్లాకు ప్రభుత్వం మాత్రం 21 వేల ఇండ్లను మాత్రమే కేటాయించింది. 3.75 లక్షల మందిలో 21 వేల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పోలింగ్ బూత్‌కు పది ఇండ్ల చొప్పున కేటాయిస్తామని, పదిమందిని ఎంపిక చేసి లిస్టు ఇవ్వాలని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు ఇందిరమ్మ కమిటీలకు సూచించినట్లు తెలిసింది. ఓవైపు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు లబ్ధిదారుల లిస్టు తయారుచేస్తుండగా, ప్రభుత్వం మాత్రం గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిచేస్తామని ప్రకటించింది.
అలాగే, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసాలో ఇదే తంతు కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా రేషన్ కార్డులు లేక అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం గత కొన్నేండ్లుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సహాయం కోసం మహిళలు కూడా పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎంపిక కూడా ఎలా జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. గ్రామ సభల్లో ఎంపిక చేస్తారా.. లేక ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారా అనేదానిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
ఓవైపు ప్రభుత్వం గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెబుతున్నప్పటికీ తెరచాటున పెద్దఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి పథకాలు తమకే ఇప్పించాలంటూ ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్నేండ్లుగా సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నామని, అధికారం వచ్చినందున ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నీ మన పార్టీ వారికే ఇవ్వాలని కిందిస్థాయి నాయకులు ఎమ్మెల్యేలపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు కిందిస్థాయి నాయకులు ఆయా గ్రామాలకు సంబంధించిన నాయకుల లిస్టులను కూడా సిద్ధం చేసుకుని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నది మిస్టరీగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక కల్లబొల్లి మాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పనిసరిగా నెరవేర్చాలి. పేదలకు రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు బీమా పథకాలు అమలు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పంటల సాగు సమయంలో అన్ని రకాల పథకాలు అందేవి. కాని, కాంగ్రెస్ ఏమీ పట్టించుకోకుండా టైంపాస్ చేస్తున్నది.
– డేరంగుల సత్యనారాయణ