జిల్లాలో ఎల్ఆర్ఎస్(అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభించలేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించగా, గ్రామ పంచాయతీల్లో మాత్రం ఇంకా షురూ కాలేదు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొక్కుబడిగా సాగుతున్నది. బాధ్యతలు అప్పగించిన బృందాలకు సొంత శాఖల పనులు ఉండడంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో జాప్యం జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 37,313 ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, వీటిలో అత్యధికంగా మున్సిపాలిటీల్లో 21,084 దరఖాస్తులు, గ్రామ పంచాయతీల్లో 16,229 దరఖాస్తులు వచ్చాయి.
– వికారాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)
ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో జాప్యం…
జిల్లాలో అనుమతిలేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టేలా ఉన్నది. మున్సిపాలిటీలో టీపీవో(టౌన్ ప్లానింగ్ ఆఫీసర్), ఇరిగేషన్ ఏఈ, ఆర్ఐ(రెవెన్యూ ఇన్స్పెక్టర్) లతో బృందాన్ని, గ్రామ పంచాయతీల్లో ఆర్ఐ, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకుగాను టీంలుగా ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖలో నలుగురు మాత్రమే ఇరిగేషన్ ఏఈలు ఉన్నారు.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండాల్సి ఉండగా, కేవలం తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలకు మాత్రమే టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులకు మొన్నటి వరకు ఓటరు జాబితా బాధ్యతలు ఉండడం, ఆర్ఐలకు ధరణి బాధ్యతలతోపాటు రెవెన్యూ ఫైళ్లకు సంబంధించి వీరే రిపోర్ట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. పరిశీలన బృందంలో ఉన్న ఇరిగేషన్ ఏఈలకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడంతోపాటు మరోవైపు ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులకు ఇతర బాధ్యతలు ఉండడంతో ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించడం లేదు.
ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించినప్పటికీ మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది. గ్రామ పంచాయతీల్లో 16,229 దరఖాస్తులురాగా, ఇప్పటివరకు ఒక్క దరఖాస్తుకు సంబంధించి పరిశీలన చేయలేదు. మరోవైపు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో 21,084 దరఖాస్తులు ఉండగా, వీటిలో ఇప్పటివరకు కేవలం 424 దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించగా, ఒక్క దరఖాస్తు పరిశీలన కూడా పూర్తి కాలేదు. పరిశీలన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ తదితర వివరాలను పూర్తిగా పరిశీలించి ప్రత్యేక యాప్‌లో వివరాలను పొందుపరుస్తున్నారు.
సంబంధిత ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రెగ్యులరైజ్ డబ్బులను లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంత మొత్తంలో ఫీజులు చెల్లించాలనే దానిపై దరఖాస్తుదారులకు మెస్సేజ్ రూపంలో సమాచారం అందించనున్నారు. ఆ తర్వాత సంబంధిత విస్తీర్ణానికి అనుగుణంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. నామమాత్రంగా తనిఖీలు చేస్తే అక్రమంగా వెలిసిన ప్లాట్లు రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉన్నది. పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా చేయనట్లయితే బఫర్ జోన్, ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూముల్లోని ప్లాట్లు కూడా రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.