పరిగి, జూన్ 14 : ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ్చిన ధాన్యం బస్తాలను వాహనాల నుంచి ఖాళీ చేయకపోవడం వల్ల రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడంలేదు. మరోవైపు కవర్లు కట్టినా సైతం వర్షానికి ధాన్యం బస్తాలు తడవడం, ఉదయం సమయంలో కవర్లు తీసేసి ఎండబెట్టడం కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.
ప్రభుత్వం ఒకవైపు దాదాపు ధాన్యమంతా కొనేశామని డాంబికాలు పలుకుతుండగా క్షేత్రస్థాయిలో రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు పరిశీలిస్తే సర్కారు చెబుతున్నదంతా అబద్ధమని తేలుతున్నది. రైతులు స్వయంగా ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలు తీసుకువచ్చినా పరిగి సమీపంలోని ఓ రైస్ మిల్లు వారు రోజుల తరబడి బస్తాలు ఖాళీ చేసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగి పట్టణ శివారులోగల బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద గత కొద్ది రోజులుగా రైతులు తమ ధాన్యం బస్తాలతో రాత్రి, పగలు అక్కడే ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వస్తున్నది. ఆదివారం సైతం 20కి పైగా ట్రాక్టర్లు, పదికి పైగా లారీల్లో వచ్చిన ధాన్యం గత నాలుగు రోజులుగా అక్కడే ఉన్నట్లు రైతులు వాపోయారు.
కలెక్టర్ ఆదేశించినా రాని మార్పు
స్వయంగా కలెక్టర్ దీపక్‌తివారీ రైస్ మిల్లును సందర్శించి ఎప్పటికప్పుడు ట్రాక్టర్లు, లారీల్లోని ధాన్యాన్ని దించుకోవాలని ఆదేశించినా వాస్తవానికి జరగడం లేదు. కలెక్టర్, అదనపు కలెక్టర్ వచ్చిన సమయాల్లో ఉండే స్థానిక అధికారులు ఆ తర్వాత పట్టింపులేని ధోరణితోనే ధాన్యం బస్తాలు దించుకోవడంలో ఆలస్యం జరుగుతున్నది. అవసరం మేరకు అదనంగా హమాలీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలు దించుకోవాలని, ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించి రోజులు గడుస్తున్నా రైతులకు పాట్లు మాత్రం తప్పడంలేదు. కనీసం నాలుగు రోజుల లోపు బస్తాలు దించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఓసారి హమాలీలు లేరని చెబుతారని, మరోసారి వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉందని.. కావాలని వడ్ల బస్తాలు దించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. తాము ట్రాక్టర్లలో ధాన్యం తీసుకువచ్చి సాయంత్రం లోపు ట్రాక్టర్ పంపించకుంటే ప్రతిరోజుకు వెయ్యి రూపాయలకు పైగానే ట్రాక్టర్ యజమానులకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. సకాలంలో వడ్ల బస్తాలు దించుకోక ఇబ్బందులతోపాటు ఆర్థిక భారం పడుతున్నదన్నారు. దీంతోపాటు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని రైతులు వాపోయారు. తమకు అన్ని రకాలుగా నష్టం జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ధాన్యం బస్తాలు త్వరగా దించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

దిగులు చెందుతున్న రైతులు
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువులకు, కుంటలకు వరద నీరు చేరింది. ఆయా గ్రామాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాల్లో వర్షపు నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతుల వరి ధాన్యం బస్తాలు భారీ వర్షానికి తడిసిపోయాయి. వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి ఉంటే వరి ధాన్యం ఇప్పుడు తడిసి ఉండేది కాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
అప్పులు చేసి ఆరుగాలం నష్టపడి పండించిన పంటను అమ్మే సమయానికి ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేకనే ధాన్యం తడిసిపోయిందని రైతులు కంటతడి పెట్టుకున్నారు. మరికొంత మంది రైతులు ధాన్యాన్ని మిల్లుల వరకు తీసుకొచ్చినా కొనుగోలు జరుగక నిలిచిపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోయిందని దిగులుచెందారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు మళ్లీ అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో చిరుజల్లులు కురువగా.. మరికొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
జిల్లాలో నమోదైన వర్షపాతం
వికారాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోమిన్‌పేట 54.5 మిల్లీ మీటర్లు, దౌల్తాబాద్ 18.5, కొడంగల్ 2, తాండూరు 11.3, ధారూరు 25.5, దుద్యాల 31.5, నవాబుపేట 60.8, కోట్‌పల్లి 15.8, వికారాబాద్ 63.3, యాలాల 35, పరిగి 47.3, బంట్వారం 9.3, పూడూరు 89.3, చౌడాపూర్ 61.8, కులకచర్ల 27, దోమలో 31.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
నత్తనడకన కొనుగోళ్లు
కొడంగల్ : వరి ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నత్తనడకన చేపడుతున్నదని, తద్వారా తమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటను కొనుగోలు చేపట్టడంలో సర్కారు చిత్తశుద్ధిని చూపడం లేదన్నారు. వరి ధాన్యం రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో, రైస్మిల్ల వద్ద పేరుకుపోయాయని, కొనుగోళ్ల పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి ఏకోశానా కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై ఏర్పాటు చేసుకున్న వరి ధాన్యం కుప్పలు నీటిపాలైందని, అయినప్పటికీ కొనుగోళ్లు వేగంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముైద్దెనట్లు వాపోయారు. తడిసిన ధాన్యం మొలకెత్తుతున్నదని, రైతుల కష్టం వర్షంపాలౌతున్నట్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

నాలుగు రోజులుగా వడ్ల బస్తాలు దించుకోవడంలేదు
ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందనే పేరుతో నాలుగు రోజులుగా వడ్ల బస్తాలు దించుకోవడంలేదు. నా సొంత పొలంలో వరి పండించగా 300 బస్తాల దిగుబడి వచ్చింది. తాము ట్రాక్టర్లలో వడ్లు తీసుకువస్తే మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. గత రెండు మూడు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయి. హమాలీలు లేరంటున్నారు, తేమ శాతం ఎక్కువుందంటున్నారు. ప్రస్తుతం పత్తి విత్తనాలు వేసే సమయంలో ధాన్యం బస్తాలతో మేము ఇక్కడ ఉండాల్సి వస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వెంటనే ధాన్యం బస్తాలు దించుకోవాలి.
– కొంకలి రాజు, రైతు, చిగురాల్‌పల్లి