తలకొండపల్లి, మే 6 : మద్దతు ధర ప్రకటించి రైతులవద్దే ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం తలకొండపల్లి, పడకల్, వెల్జాల్, చుక్కాపూర్, గట్టుఇప్పలపల్లి, రాంపూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఆమనగల్లు మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండో చెర్మన్ కేశవరెడ్డి, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను రాజు చేసేందుకు 24గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రెండు పంటలకు పదివేల పెట్టుబడి సాయమందిస్తున్నదన్నారు.
పండించిన పంటకు మద్దతు ధర, ప్రాజెక్టులతో సాగునీరు, ఎరువులు, విత్తనాలు వంటివాటిని అందిస్తూ అండగా నిలుస్తున్నదాన్నరు. కల్వకుర్తి డీ 82ను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. సమావేశంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చెర్మన్ కేశవరెడ్డి, ఎంపీడీవో రాఘవులు, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి రాజు, వైస్ చెర్మన్ కూన రవి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, సర్పంచ్‌లు రమేశ్, స్వప్న భాస్కర్‌రెడ్డి, కిష్టమ్మ, చంద్రయ్య, ఈశ్వర్‌నాయక్, ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శేఖర్, రమేశ్, నాయకులు గణేష్‌గుప్తా, శ్రీశైలం పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందజేస్తూ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన సాయిలు అనారోగ్యంతో దవాఖానలో చేరారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కడ్తాల్, మే 6: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోని మార్కెట్ యార్డులో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యాన్ని ఏఎంసీ, పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి, వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రకం ధాన్యానికి రూ.1,960, రెండో రకానికి రూ.1,940 ధరను ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు.
పాదయాత్రలు, సభలతో ఒరిగేదేమి లేదు..
తెలంగాణపై ప్రతిపక్ష పార్టీల నాయకులు దండయాత్రలు చేస్తున్నారని, పాదయాత్రలు, సభలతో ఒరిగేదేమిలేదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతే, తెలంగాణలో పర్యటించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వడ్లను కేంద్ర ప్రభుత్వం కొంటుందని వరిసాగు చేయించిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉనికిని కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సభలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నాయని దుయ్యబట్టారు. అనంతరం ఆమనగల్లు పట్టణానికి చెందిన శివకుమార్‌కి మంజూరైన రూ.9,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, వైస్ చైర్మన్ సత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, మార్కెట్ కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.