మాడుగుల, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని అవురుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ ఏఈ పట్టించుకోకపోవడం పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. నెల రోజుల నుండి నీరు వృథాగా పోతున్న పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు. ఓ వైపు గ్రామాల్లో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలా నీటిని వృథా చేయడమేంటని ప్రశ్నస్తు న్నారు. మండలంలో మిషన్ భగీరథ నీరు రాక మహిళలు బిందెలు తీసుకొని నిరసన తెలిపే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.