యాచారం, మార్చి 22: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం (Haritha Haram) కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ పదేండ్లపాటు పకృతి రమణీయతను సంతరించుకున్నది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. హరితహారం కింద నాటిన మొక్కల పట్ల అధికారులకు శ్రద్ధ లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ మొక్కలు అనతికాలంలోనే మోడులుగా మారిపోయాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చగా ఉండాల్సిన హరితహారం మొక్కలు నీళ్లు లేక, నిర్వహన సక్రమంగా లేక ఎండిపోయి ఒక్కసారిగా కళ తప్పుతున్నాయి. 2023-24కు గాను మండలంలో ఈజీఎస్ ఆధ్వర్యంలో సుమారు 75 వేల హరితహారం మొక్కలు నాటారు.
వాటిలో దాదాపు నీళ్లు లేక అధిక శాతం మొక్కలు ఎండిపోయినవి. మేడిపల్లి-నానక్‌నగర్ రోడ్డుకు ఇరువైపులా టీఎస్ఐఐసీ సహకారంతో సుమారుగా 1000కి పైగా మొక్కలు నాటారు. అందులో కనీసం 300ల మొక్కలు కూడా పచ్చగా లేకపోవడం గమనార్హం. నిర్వాహన సక్రమంగా లేకపోవడంతో మొక్కలన్ని ఎండిపోయినవి. కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయి కేవలం సపోర్టు కర్రలు మాత్రమే మిగిలినవి. మరికొన్ని చోట్ల మొక్కల ఆనవాళ్లు కూడా లేకుండా కేవలం గుంతలు మాత్రమే దర్శనమిస్తున్నవి. మాజీ సీఎం కేసీఆర్ పచ్చదనాన్ని పెంపొందించడానికి, పర్యావరణంను పరిరక్షించడానికి మొక్కవోని దీక్షతో హరితహారం, పల్లె పకృతివనాలు, బృహత్ పకృతి వనాల పేరుతో విచ్చలవిడిగా మొక్కలు నాటించాడు. పదేళ్లు పచ్చదనంతో ఉన్న హరితహారం మొక్కలు ఏడాదిన్నర కాలంలోనే ఎండిపోవడంతో హరితహారంపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఇట్టే అర్ధమవుతున్నది.