పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై అమెరికా జలాంతర్గామి దాడిచేసింది. ఈ దాడిలో 87 మంది జలసమాధి కాగా, మరో వంద మంది వరకూ గాయపడ్డారు. ఈ యుద్ధనౌక భారత్‌తో జరిగిన నేవీ విన్యాసాల్లో పాల్గొని తిరిగివెళ్తుండగా హిందూ మహాసముద్రంలో టార్పెడోలతో అమెరికా సబ్‌మెరైన్ దాడిచేసింది. నౌకను కూల్చింది తామేనని అమెరికా ప్రకటించింది. మరోవైపు, ఇరాన్‌కు చెందిన అణు ప్రాజెక్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా కాన్సులేట్ భవనాలే టార్గెట్‌గా ఇరాన్ విరుచుకుపడింది. యుద్ధం మొదలైనప్పటినుంచీ ఇప్పటివరకు ఇరాన్లో 1,145 మంది మరణించినట్టు ఆ దేశ అధికారవర్గాలు తెలిపాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన ఓ యుద్ధ నౌకపై అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది. ఈ దాడిలో 87 మంది మృత్యువాతపడగా, మరో వంద మంది వరకూ గాయాలపాలయ్యారు. మరోవైపు, ఇరాన్‌కు చెందిన అణు ప్రాజెక్టులపై ఇజ్రాయెల్ దాడులు జరుపగా, అమెరికా కాన్సులేట్ భవనాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. ఇంకోవైపు, ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తాబా ఖమేనీ పగ్గాలు చేపడుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం ఆ వార్తలను తోసిపుచ్చింది. అలాగే, బుధవారం జరుగాల్సిన ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేసింది. కాగా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 1,145 మంది మరణించినట్టు సమాచారం.
ఐదోరోజు కూడా ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ భీకర దాడులు కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాపై అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది. దీంతో ఆ నౌక మునిగిపోయి 87 మంది మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు శ్రీలంక నేవీ ధ్రువీకరించింది. నౌక నుంచి రక్షించిన వారిని దవాఖానకు తరలించినట్టు అధికారులు తెలిపారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ఈ యుద్ధనౌక భారత్‌లో జరిగిన ఓ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం. ఇరాన్ యుద్ధనౌకను తామే ముంచేశామని అమెరికా ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఆ నౌకపై సబ్‌మెరైన్ టార్పిడోలతో దాడులు చేసినట్టు వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు దేశంపై ఈ తరహా దాడులు ఇదే తొలిసారని పేర్కొన్నది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో ఇరాన్ ప్రభుత్వం రహస్యంగా ఏర్పాటు చేసిన భూగర్భ అణుప్రాజెక్టుపై ఇజ్రాయెల్ రక్షణ దళం దాడులు చేసింది. దీంతో న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్ ధ్వంసమైంది. మరోవైపు, ఇరాన్‌లోని ఇస్ఫహాన్ అణుకేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
ఖమేనీ మృతి నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్న అమెరికా ఎంబసీ భవనాలే లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై డ్రోన్ దాడులు జరిపింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని యూఎస్ ఎంబసీలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) స్టేషన్‌పై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీలోని రాస్ తనూరా ఆయిల్ కేంద్రంపై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. అమెరికా సాయంతో యూఏఈలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను తమ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో కూల్చేశాయని ఇరాన్ పేర్కొన్నది. యూఏఈకి రక్షణగా ఫ్రాన్స్ రఫేల్ జెట్లను మోహరించినట్టు సమాచారం. తుర్కియే మీదకు ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని నాటో కూల్చేసింది.
ఇరాన్‌పై ఇబ్బడిముబ్బడిగా దాడులు చేయడంతో అమెరికా క్షిపణి నిల్వలు అంతకంతకూ అడుగంటిపోతున్నట్టు తెలిసింది. శత్రు దేశపు డ్రోన్లు, క్షిపణులను కూల్చేసే ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు పడిపోయినట్టు పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదిక లీకైంది. క్షిపణి నిల్వలు తగ్గుతున్న వేళ అత్యయిక సమావేశానికి ట్రంప్ ఆదేశించినట్టు సమాచారం. ఆయుధ ఉత్పత్తి త్వరితగతిన పెంచడమే లక్ష్యమంగా ఈ మీటింగ్ జరుగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, హొర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో చమురు భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హొర్ముజ్ గుండా వెళ్లే చమురు నౌకలకు అవసరమైతే అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని హామీనిచ్చారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు.
ఇరాన్లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించేందుకు అమెరికా పథక రచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న ఖుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని, తద్వారా దేశంలో ప్రజా తిరుగుబాటును పెంచాలని అమెరికా నిఘా సంస్థ సీఐఏ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇరాన్ విపక్ష గ్రూపులు, ఖుర్దీష్ నాయకులు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, అప్ఘానిస్థాన్ ఏకమై పాక్‌ను లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉన్నదన్నారు. పాక్‌ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతున్నదని, ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా మారిందని అక్కసు వెళ్లగక్కారు.
ఖమేనీ మరణానంతరం ఇరాన్ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారన్న చర్చ పెద్దయెత్తున కొనసాగుతున్నది. ఈ క్రమంలో దేశ తదుపరి సుప్రీంగా ఖమేనీ కుమారుడు ముజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టు ఇరాన్ ఇంటర్నేషనల్‌తో పాటు ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఇరాన్లో సుప్రీం నేతగా ఎవరు కొత్తగా ఎన్నికైనప్పటికీ, వాళ్లను లక్ష్యంగా చేసుకొంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మృతి చెందిన ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఖమేనీ అంత్యక్రియలను తొలుత బుధవారం నిర్వహించాలని భావించినప్పటికీ, వాటిని వాయిదా వేసినట్టు ఇరాన్ ఇస్లామిక్ ప్రొపగేషన్ కౌన్సిల్ తెలిపింది. త్వరలోనే తేదీని ప్రకటించనున్నట్టు వెల్లడించింది. ఖమేనీ జన్మించిన మషాద్ నగరంలోనే ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం.
అయతుల్లా అలీ ఖమేనీకి ఆరుగురు సంతానం. ఇందులో రెండోవాడే ముజ్తాబా హొస్సేనీ ఖమేనీ. 1969లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. కోమ్ నగరంలో మత విద్యను అభ్యసించారు. 1980ల్లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తాబా పాల్గొన్నారు. అలా ఇరాన్ సైన్యానికి దగ్గరై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)తో బలమైన సంబంధాలను పెంచుకొన్నారు. ఇరాన్లో అధికారిక పదవులు ఏమీ చేపట్టకపోయినా.. రాజకీయ, పాలనాపరమైన నిర్ణయాల్లో ఈయన తెరవెనుక కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. ముజ్తాబా భార్య జహ్రా. వీరికి ముగ్గురు సంతానం. ఇటీవలి ఇజ్రాయెల్ దాడుల్లో ముజ్తాబా సతీమణి మరణించినట్టు సమాచారం.