అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. దక్షిణాది సంప్రదాయ వస్త్రధారణలో కొత్త దంపతులు మెరిసిపోయారు.

గత నెల 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వివాహం మొదలు రిసెప్షన్ వరకు ‘విరోష్’ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వివాహానంతరం కొత్త జంట పలు కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. ఇటీవలే దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మిఠాయిల పంపిణీతో పాటు ఎంపిక చేసిన దేవాలయాల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు.

సొంత ఊరు తుమ్మన్పేట్లో విజయ్ దేవరకొండ నూతన గృహ ప్రవేశం చేయడంతో పాటు గ్రామస్తులకు వివాహ విందు ఇచ్చారు. ‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్ తాలూకు ఫోటోలు సోషల్‌మీడియాల్లో ట్రెండింగ్ నిలిచాయి.

కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కరణ్‌జోహార్, అల్లు అర్జున్, రవితేజ, నాగచైతన్య, రామ్‌చరణ్, నాని, రానా, శ్రీలీల, నమ్రత, శ్రీకాంత్, దిల్‌రాజు, సుకుమార్, కార్తీ, శరత్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.

బుధవారం మధ్యాహ్నం విరోష్ జోడీ తెలుగు మీడియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన సినీ ప్రయాణంలో మీడియా విడదీయరాని భాగమైందని, వారిని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. రష్మికను చూపిస్తూ ‘తెలుగు రాష్ర్టాలకు కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘మేమిద్దరం జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాం. మీ ఆశీస్సులు కోరుతున్నాం’ అని రష్మిక మందన్న పేర్కొన్నారు.