దోమ, జూన్ 2: అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా దోమ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. రాజకీయ కుట్రతో మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి పై కేసు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే 173 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన ఇద్దరు రెడ్డి లీడర్లు ఉన్నారని ఆరోపించారు. ముందుగా వారిని అరెస్టు చేసిన తర్వాతే మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి జోలికి రావాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దోమ మండల కేంద్రంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో రామన్న మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పై పెట్టిన అక్రమ కేసు విషయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య ముదిరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అక్రమ కేసు పెట్టి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.
సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక తమ నాయకుడు నాగిరెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదెకరాల లీజు భూమి మైనింగ్ లో ఒక ఎకరం డివోట్ కావడం సాధారణమైన విషయమని అదనంగా ఏరియాను వాడుకున్నప్పుడు గుర్తించి అధికారులు జరిమానాలు విధిస్తారు కానీ అక్కడ హత్యలు దోపిడీలు చేసినట్లు డ్రైవర్లను పనివారిని ముసుగులు వేసి రిమాండ్ చేయడం వెనక పొలిటికల్ ప్రెజర్ ఉందని వారు ఆరోపించారు. పని మీద వెళ్లిన జడ్పీటీసీ నాగిరెడ్డిని పారిపోయాడంటూ ప్రెస్మీట్ పెట్టి ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.