పరిగి : ఆహార కొరతతో మరణాలు సంభవించకుండా అరికట్టేందుకు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 2కోట్ల 90లక్షల మందికి పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మానవ సంపదను కాపాడుకోవడానికే ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి ముఖ్య అతిథిగా జిల్లా స్థాయి జాతీయ ఆహార భద్రత చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ ఆహార కొరత, పౌష్టికాహార లోపంతో మరణాలు సంభవిస్తున్నాయని, భారత్‌లో 19కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని తేలింది. దీంతో ప్రతి ఒక్కరికి ఆహారం అందించడం, అవసరమైన వారికి పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పీడీఎస్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 75శాతం మందికి, పట్టణ ప్రాంతాలలో 50శాతం మందికి రేషన్ సరుకులు సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈ సదుపాయాలు పకడ్బందీగా అమలయ్యేలా చూసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతినెల సమావేశాలు జరుపాలన్నారు. సమస్యలను అంతర్గతంగా పరిష్కరించేందుకే ఈ కమిటీలు వేయాలని, లబ్ధిదారులు ఈ కమిటీల పనితీరుతోను సంతృప్తి చెందకుంటే ఫుడ్ కమిషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. రేషన్ దుకాణం దూరంగా ఉన్న గ్రామాల్లో నెలకు కనీసం 5 రోజులు రేషన్ సరుకుల సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 19 మండలాల్లో 588 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 8,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 7,488 రేషన్‌కార్డులు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో 1023 పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు.
పౌష్టిక విలువలు గల కోడిగుడ్డు, పప్పు, కూరగాయలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 1106 అంగన్వాడీ కేంద్రాల్లో 53,224 మంది చిన్నారులకు, 870మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు పెరిగాయని జిల్లా వైద్యాధికారి తుకారాంభట్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.