తాండూరు రూరల్, డిసెంబరు 19 : తాండూరు మండలం, జినుగుర్తి గ్రామ శివారులో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ పార్కు భూముల ఒప్పందం పూర్తయింది. సర్వే నం.206లో 222 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు రాబోతున్నది. 82 మంది రైతులకు చెందిన 222 ఎకరాల భూములకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఒప్పందం పూర్తి చేశారు. ఎకరాకు రూ.12 లక్షల చొప్పున 82 మంది రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కొంతమంది రైతులు చనిపోగా.. వారి కుటుంబ సభ్యుల నుంచి రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. వారికి కూడా నష్టపరిహారం ఎలా అందజేయాలో సమాలోచనలు చేస్తున్నారు. బోరు బావులున్న రైతులకు ఎకరాకు రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం ఇవ్వవచ్చని అధికార వర్గాల సమాచారం.
ఒకే చోటుకు పాలీషింగ్ యూనిట్లు
తాండూరు పట్టణం చుట్టూ గౌతాపూర్, చెన్‌గేష్‌పూర్, కోకట్, అంతారం, కొడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న పాలీషింగ్ యూనిట్లన్నీ జినుగుర్తి శివారులో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ పార్కుకు తరలిస్తారు. దీంతో పొల్యూషన్ కూడా కంట్రోల్లోకి రానున్నది. పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే, పనులు మొదలెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పార్కు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అహర్నిశలు కృషి చేశారని పలువురు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.