చౌటుప్పల్, మార్చి 16 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం నుండి నేరుగా ధర్మోజిగూడెం హైవే వరకు ఉన్న లింక్ రోడ్డును బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కు చౌటుప్పల్ 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్ సోమవారం వినతి పత్రం సమర్పించారు. 65వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రస్తుతం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వినతిలో పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్ నుండి మునుగోడు వైపు వెళ్లే వాహనాలు స్థానిక పట్టణ కేంద్రంలోకి రాకుండా నేరుగా తంగడపల్లి మీదిగా వెళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం తక్షణమే ఈ లింక్ రోడ్డును బైపాస్ రోడ్డు గా మార్చాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామ పాత గ్రామ పంచాయతీ భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పక్కా భవనంలోకి మార్చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి 4వ వార్డు కౌన్సిలర్ ఊదరి యాదయ్య తీసుకెళ్లారు. దామెర గ్రామంలో ఏర్పాటు చేసిన పక్కా భవనం పూర్తయిందని ఆయన కలెక్టర్ వివరించారు. తక్షణమే పిహెచ్సీని అక్కడకు మార్చాలని కోరారు. ఈ పాత గ్రామ పంచాయతీ భవనాన్ని వార్డు కౌన్సిలర్ కార్యాలయంగా కేటాయించాలని కోరారు.