Oscar | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కింది. 98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తమ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నివాళి విభాగంలో భారతదేశానికి చెందిన నలుగురు దిగ్గజ కళాకారులను స్మరించింది. 2025 – 2026 ఆస్కార్ వేడుకల మధ్య కాలంలో కన్నుమూసిన ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ సినీ కళాకారులను గుర్తుచేసుకుంటూ అకాడమీ “2025 మరియు 2026 ఆస్కార్ల మధ్య మనం కోల్పోయిన కళాకారులు, చలనచిత్ర నిర్మాతలను స్మరించుకోవడానికి ఒక క్షణం కేటాయించండి” అనే సందేశంతో వారి ఫోటోలను ప్రదర్శించింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ప్రముఖ నటుల ఫోటోలు కూడా చోటు దక్కడం విశేషంగా మారింది.
ఈ నివాళి జాబితాలో తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు, బాలీవుడ్ ‘హీ–మ్యాన్’గా పాపులారిటీ దక్కించుకున్న ధర్మేంద్ర, దేశభక్తి కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు–నటుడు మనోజ్ కుమార్, అలాగే దక్షిణాది వెండితెరలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి సరోజా దేవిలకు అకాడమీ నివాళి అర్పించింది. దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు వీరు అందించిన సేవలను గుర్తిస్తూ ప్రపంచంలోనే అత్యున్నత సినీ వేదిక అయిన ఆస్కార్ ఈ విధంగా స్మరించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు తన అసాధారణ నటనతో తెలుగు మరియు దక్షిణ భారత చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. ఆయన చేసిన విలక్షణ పాత్రలు, సంభాషణలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఇక బాలీవుడ్లో ధర్మేంద్ర తన యాక్షన్, భావోద్వేగ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు మనోజ్ కుమార్ దేశభక్తి కథలతో భారతీయ ప్రేక్షకుల్లో దేశప్రేమను రగిలించే సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే సరోజా దేవి తన అందం, సహజ నటనతో దక్షిణాది సినీ రంగంలో ఒక కాలాన్ని శాసించారు. ప్రపంచ సినీ వేదికపై భారతదేశానికి చెందిన ఈ ప్రముఖ కళాకారుల ఫోటోలు ప్రదర్శించబడటం భారతీయ సినీ ప్రేమికులకు గర్వకారణంగా మారింది. వారి కృషి, ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా గొప్పతనానికి కూడా ఈ గుర్తింపు దక్కిందని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.