టెల్ అవివ్: లెబనాన్‌లోని హిజ్బొల్లా మిలిటెంట్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని నివాసితుల రక్షణ కోసం గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. లెబనాన్‌లో ఉన్న ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఐడీఎఫ్ తన స్టేట్మెంట్లో వెల్లడించింది. సైనిక బలగాలు లెబనాన్‌లో అడుగుపెట్టడానికి ముందు కీలక ప్రాంతాలపై వైమానిక దాడలు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. చాలా వరకు టెర్రరిస్టు టార్గెట్లను పేల్చివేసినట్లు పేర్కొన్నది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్‌లో సుమారు 800 మంది పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంట్లో వందకుపైగా చిన్నారులు ఉన్నారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయల్ దళాలు నిర్వహిస్తున్న దాడిపై పోప్ లియో స్పందించారు. తక్షణమే యుద్ధాన్ని విరమించాలని ఆయన కోరారు. హింస ద్వార స్థిరత్వాన్ని ఎన్నటికీ సాధించలేరన్నారు. వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ఆయన ప్రసంగించారు. పశ్చిమాసియా ప్రజలు రెండు వారాలుగా భయానకమైన హింసను అనుభవించినట్లు చెప్పారు. దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల తరపున ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు, ఆస్పత్రులు, రెసిడెన్షియల్ ప్రాంతాలపై జరిగిన దాడుల వల్ల అనేక మంది మరణించినట్లు చెప్పారు. హింసతో న్యాయం జరగదు అని, స్థిరత్వం.. శాంతి స్థాపించలేరన్నారు. యుద్ధంతో వివాదాలను పరిష్కరించే ప్రక్రియ సరైంది కాదన్నారు.