సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సైబర్‌సిటీ సర్కిల్లో జరుగుతున్న అక్రమాలపై నమస్తే తెలంగాణ వరుస కథనాల నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఆరా తీశారు. ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు, అసలు సైబర్సిటీలోని కొండాపూర్, అల్లాపూర్ ప్రాంతాల్లో ఏం జరిగింది అనే దిశగా ఆయన విచారణ కొనసాగింది. సైబర్‌సిటీ సర్కిల్‌తో పాటు రంగారెడ్డి జోన్లోనే కొన్ని ఏరియాల్లో విద్యుత్ కనెక్షన్లు, అనుమతులు తదితర అంశాలపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను టీజీఎస్పీడీసీఎల్ సీరియస్‌గా తీసుకుంటున్నదని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
విచారణలో వాస్తవాలు, బాధ్యతలు, విధి నిర్వహణలో ఏవైనా లోపాలు జరిగాయా అనే అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని సీఎండీ చెప్పారు. హైకోర్టు ఆర్డర్లు మార్చడంతో పాటు పలు నకిలీ పత్రాలతో అక్రమ నిర్మాణాలకు సర్వీసు కనెక్షన్లు ఇవ్వడం, అవి కూడా యూడీఎస్ కింద ఉన్న మీటర్లను పేర్లు, చిరునామా మార్పుతో పలు అవకతవకలకు పాల్పడడంపై నమస్తే కథనాలు సంచలనం సృష్టించాయి. అసలు హైకోర్టు తీర్పులే మార్చడమేంటంటూ సీఎండీ అవాక్కయినట్లు తెలిసింది. ఈ మేరకు అక్రమాలు జరుగుతుంటే సీనియర్ అధికారులు ఎలా చూస్తూ ఊరుకున్నారని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
అంతేకాకుండా ఇద్దరు ఏడీఈలు తమ లాగిన్ల విషయంలో చెప్పిన కారణాలపై కూడా జితేశ్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న ఇద్దరు ఆర్టిజన్లు గతంలో సస్పెండయి మళ్లీ అదే ప్రాంతానికి ఎలా వచ్చారని, వారికి ఎఫ్ఓసీ డ్యూటీలు ఉండగా మొత్తం సెక్షన్లనే ఎలా శాసిస్తున్నారంటూ ఆయన స్థానికంగా ఉన్న ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే, వారి హోదా ఏదైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడేది లేదని సీఎండీ స్పష్టం చేశారు.
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, ప్రజల విశ్వాసమే తమకు అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు. కొండాపూర్ ప్రాంతానికి సంబంధించిన అంశంపై వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంలో సంస్థ వెనకాడేది లేదని జితేష్ పాటిల్ చెప్పారు. సంస్థ ప్రతిష్టను కాపాడడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం తమ ప్రథమకర్తవ్యమని, ఎవరైనా తప్పు చేస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే వినియోగదారుల ఫిర్యాదులను మరింత పారదర్శకంగా స్వీకరించి పరిష్కరించేందుకు కస్టమర్ రిలేషన్ మేనేజర్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ జితేశ్ పాటిల్ తెలిపారు. ఇటీవల మౌలాలి ఉప్పల్ ఐసీఎస్సీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా వినియోగదారులు విద్యుత్ సేవలకు సంబంధించిన ఏవైనా అవకతవకలు, ఫిర్యాదులు, ఇబ్బందులను నేరుగా తెలియజేసే విధంగా ప్రత్యేక వ్యవస్థ అవసరమని భావించి ఈ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విచారణ సజావుగా సాగేనా!
సైబర్‌సిటీ సర్కిల్లోని కొండాపూర్‌లో జరిగిన అవకతవకల నేపథ్యంలో రంగారెడ్డి జోన్‌లోని మూడు సర్కిళ్లల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణలో వరుస కథనాలను చాలామంది తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో పాటు విచారణ సరిగ్గా జరుగుతుందా అంటూ చర్చించుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఇంజనీర్లతో పాటు అక్కడి ఆర్టిజన్లు తమకున్న పలుకుబడిని ఉపయోగించి సంస్థాగతంగా జరుగుతున్న విచారణపై ప్రభావం చూపించడానికి ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టినట్లు కార్పొరేట్ ఆఫీసులో చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ సర్కిల్లోని ఇద్దరు ఏడీఈలు, ఒక కీలక ఇంజినీర్ తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారని, రాజకీయంగా కూడా తమకున్న పలుకుబడిని , తమ సొంత ప్రాంతాలకు చెందిన నాయకుల ద్వారా సంబంధిత శాఖ పెద్దలకు చెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మరోవైపు సీఎండీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణాధికారులతో పాటు విజిలెన్స్పై కూడా ఒత్తిడి తెచ్చే దిశగా వారు జోరుగా ప్రయత్నిస్తున్నట్లు మింట్‌కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.