పరిగి, జూలై 19: కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ఈ మధ్య దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన అగ్రకుల పెత్తందార్లను వెంటనే అరెస్ట్ చేసి, వారికి వత్తాసు పలుకుతున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శనివారం పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుగ్గప్ప, ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రమేశ్ బాబు, అవాజ్ సంఘం నాయకులు ఎండీ హబీబ్ లు మాట్లాడుతూ.. దళితుల భూములను అగ్ర కుల పెత్తందార్లు, కాంట్రాక్టర్లు ఆక్రమిస్తున్నారని, వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ అధికారులు పెత్తందార్లకు, కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకు తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కొడంగల్, పరిగి నియోజకవర్గాలలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. దాడులకు గురైన బాధితులు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు దాడులు చేసిన అగ్ర కుల పెత్తందార్లకు కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటనలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులైన దళితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక వికారాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.