వికారాబాద్, ఏప్రిల్ 30 : లింగ వివక్షతలను రూపుమాపడానికి కృషి చేసిన అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. బుధవారం మహాత్మా బసవేశ్వర 892 వ జయంతోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతలను రూపుమాపడానికి కృషి చేసిన అభ్యుదయ వాది బసవేశ్వరుడని కొనియాడారు. కులం లేదు, మతం లేదు, అందరం సమానమే అని నినదించిన వ్యక్తి బసవేశ్వరుడని పేర్కొన్నారు.
మనుషులందరూ ఒక్కటే, కులాలు లేవు, ఉప కులాలు లేవు అని చాటాడు. బసవేశ్వరుడి ఆధ్వర్యంలో ఆనాడే కులాంతర వివాహాలు జరిగాయని పేర్కొన్నారు. కులాల పేరుతో విడిపోకుండా అందరు కలిసి జీవించే విధంగా హైందవ మతాన్ని సంస్కరించారని తెలిపారు. కుల రహిత సమాజం కోసం శతాబ్ధాల క్రితమే కృషి చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వర మహారాజ్ అని కొనియాడారు.
బసవేశ్వరుని బోధనలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను సమాన దృష్టితో చూస్తుందని వివరించారు. మనమందరం బసవేశ్వర మహారాజ్ బోధనలను ఆదర్శంగా తీసుకొని వాటిని నిజ జీవితంలో ఆచరించాలని, అప్పుడే సమాజంలో అందరూ సుఖ, సంతోషాలతో ఆనందంగా జీవిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్‌పటేల్, బార్అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.