కులకచర్ల, జూన్ 9 : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు ఎదురవుతున్న ఒత్తిళ్లకు చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. పంచాయతీలకు సంబంధించి ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్న చెక్కులను క్లియర్ చేయాలని, పంచాయతీల్లో నిధులు లేక చెక్కులు జనరేట్ చెయ్యని పెండింగ్ బిల్లుల వివరాలను సేకరించి వీటికి అనుగుణంగా వెంటనే పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని తెలిపారు.
గ్రామ పంచాయతీల నిర్వహణలో భాగంగా ట్రాక్టర్ డిజీల్, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ, ఇతర పారిశుధ్యనిర్వహణ ఖర్చులకు కొనుగోలు కోసం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన పలుడిమాండ్లతో కూడి వినతిపత్రాన్ని ఎంపీడీవో సోమలింగంకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.